విజయ్ చివరి సినిమా.. వచ్చేది ఎప్పుడంటే?
నెక్స్ట్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయ్ రాజకీయ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రస్తుతం తన సినిమాల కంటే ఎక్కువగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఇటీవల ఆయన రాజకీయ రంగప్రవేశం చేసి, ఓ కొత్త పార్టీని స్థాపించడం కోలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విజయ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, ఆయన రాజకీయ ప్రవేశంపై సాధారణ జనాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నెక్స్ట్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయ్ రాజకీయ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు చివరి సినిమా అంటూ విజయ్ 69వ సినిమాకు సంబంధించిన అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక దీనికి సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ బయటకొచ్చింది. ఈ చిత్రం విజయ్ కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించేలా రూపొందుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా "భగవంత్ కేసరి" తమిళ రీమేక్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీలీల పాత్రను మమిత బైజు పోషిస్తున్నారని టాక్.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానికి అనుగుణంగా తమిళ దర్శకుడు H వినోథ్ కథను తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్చి, ఈ రీమేక్‌ను తెరకెక్కిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీపై కూడా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. 2025 అక్టోబర్‌లో విడుదల చేయాలని తొలుత అనుకున్నప్పటికీ, 2026 సంక్రాంతి పండుగ కోసం కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
సంక్రాంతి పండుగ సమయంలో తమిళనాడులో సెలవులు ఎక్కువగా ఉండడం వల్ల సినిమా విడుదలకు అనుకూల సమయం అవుతుందని భావిస్తున్నారు. అయితే, విజయ్ టీమ్ ఇప్పటికీ ఈ తేదీలపై స్పష్టత ఇవ్వకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. అందరి దృష్టి త్వరలోనే ప్రకటించబోయే టైటిల్, టీజర్‌పై ఉంది.
ఇక ఈ చిత్రం టైటిల్ గురించి కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయ్ మొదటి చిత్రం "నాలయ తీర్పు" పేరును తీసుకుని ఈ సినిమాకు అదే టైటిల్‌ను పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ విజయ్ కెరీర్‌కు సెంటిమెంటల్‌గా కనెక్ట్ అవ్వడమే కాకుండా, అభిమానుల్లో ప్రత్యేక ఎమోషన్ తీసుకువస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. అంతేకాదు, ఈ టైటిల్ వల్ల ప్రేక్షకులకి కూడా మరింత దగ్గరవుతారని అంటున్నారు.
సినిమా విడుదల సమయానికి విజయ్ రాజకీయ ప్రస్థానం మరింత వేగం అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమా విజయ్ రాజకీయ పునాది బలోపేతానికి సహాయపడుతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. మరి అంతటి హైప్ ఉన్న ఆఖరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.