AAA సినిమాస్ రెండో మల్టీప్లెక్స్ ఎక్కడంటే?
తాజా మీడియా కథనాల ప్రకారం.. అమీర్ పేట్ సత్యం థియేటర్ స్థలంలో ప్రారంభించిన ఏఏఏ సినిమాస్ గొప్పగా ప్రజాదరణ పొందుతున్న క్రమంలో అల్లు అర్జున్ తో కలిసి ఏషియన్ సినిమాస్ తన ప్రణాళికల్ని భారీగా విస్తరించనున్నారని తెలిసింది.
టాలీవుడ్ కోలీవుడ్ లో టాప్ హీరోలు, నిర్మాతలతో కలిసి ఏషియన్ సినిమాస్ భారీ మల్టీప్లెక్సు థియేటర్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మల్టీప్లెక్స్ థియేటర్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగుతుండడంతో దీనిని అంతకంతకు విస్తరించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, శివకార్తికేయన్ (చెన్నై) లతో ఇప్పటికే భారీ మల్టీప్లెక్సుల్ని స్థాపించిన ఏషియన్ సినిమాస్ నుంచి మరో వార్త లీకైంది.
తాజా మీడియా కథనాల ప్రకారం.. అమీర్ పేట్ సత్యం థియేటర్ స్థలంలో ప్రారంభించిన ఏఏఏ సినిమాస్ గొప్పగా ప్రజాదరణ పొందుతున్న క్రమంలో అల్లు అర్జున్ తో కలిసి ఏషియన్ సినిమాస్ తన ప్రణాళికల్ని భారీగా విస్తరించనున్నారని తెలిసింది. ముందుగా హైదరాబాద్ లో రద్ధీగా ఉండే పలు చోట్లను గుర్తించిన ఏషియన్ సినిమాస్ ఓ ప్లేస్ ని లాక్ చేసి తమ పెట్టుబడులతో ప్రణాళికల్ని రెడీ చేసిందిట.
కోకాపేట నార్సింగి పరిసరంలో మరో మల్టీప్లెక్స్ ని నిర్మించేందుకు అల్లు అర్జున్ తో టైఅప్ అవుతోందని తెలిసింది. నిజానికి కోకాపేట్ ఏరియా ఒకప్పుడు కాకులు దూరని కీకారణ్యంలా ఉండేది. కానీ ఇప్పుడు ఆ చోటు జనావాసాలతో భారీ వ్యాపారాలతో కళకళలాడుతోంది. జనం కిటకిటలాడుతున్నారు. అందువల్ల ఈ ప్రదేశంలో మల్టీప్లెక్స్ థియేటర్ల వ్యాపారం వృద్ధి చెందుతుందని అల్లూ కాంపౌండ్ భావిస్తోంది. దీంతో ఏఏఏ సినిమాస్ వాళ్లతో కలిసి వెంటనే మరో కొత్త మల్టీప్లెక్స్ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. చెన్నైలో తమిళ హీరో శివకార్తికేయన్ తో కలిసి భారీ మల్టీప్లెక్స్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తున్న ఏషియన్ సినిమాస్ ఇప్పుడు అల్లు అర్జున్ తో ఏఏఏ సినిమాస్ రెండో భవంతిని నిర్మించేందుకు భారీ ఏర్పాట్లతో సిద్ధమవుతోందని తెలిసింది. మల్లీప్టెక్స్ థియేటర్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది.. అంటే ఈ రంగంలో లాభాలు ఆ స్థాయిలో ఉన్నాయనే అర్థం చేసుకోవాలి. ఇకపోతే కోకాపేట ఇంత వేగంగా అభివృద్ధి చెందుతోంది కాబట్టి ఆ పరిసరాల్లో మెగాస్టార్ చిరంజీవికి కొన్ని ఎకరల్లో ఫామ్ హౌస్ తోటలు ఉన్నాయి. ఇది చిరంజీవితో ఏఏఏ సినిమాస్ భాగస్వామ్యానికి దారి తీస్తుందా? అంటూ అభిమానులు డౌట్ రైజ్ చేసారు. దీనికి సరైన సమాధానం ఏషియన్ సినిమాస్ ప్రతినిధుల నుంచి లభిస్తుందేమో చూడాలి.