రాజమౌళి 'గేమ్ ఛేంజర్' రివ్యూ ఇస్తాడా..?
దర్శక ధీరుడు రాజమౌళితో వర్క్ చేసిన హీరోల తర్వాతి సినిమాలు ఫ్లాప్ అవుతాయనే బ్యాడ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్.. సంక్రాంతి కానుకగా ఈ శుక్రవారం (జనవరి 10) భారీ ఎత్తున థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి నేడు తన కుటుంబంతో కలిసి ఈ సినిమాని వీక్షించారు.
హైదరాబాద్ నల్లగండ్లలోని అపర్ణ సినిమాస్‌లో రాజమౌళి ఫ్యామిలీ ‘గేమ్ ఛేంజర్’ సినిమా చూసింది. రాజమౌళితో పాటుగా ఆయన సతీమణి రమా రాజమౌళి, కుమారుడు కార్తికేయ, కీరవాణి భార్య వల్లి, తనయుడు కాలభైరవ, మైత్రీ మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ తదితరులు కలిసి ఈ మూవీ వీక్షించారని తెలుస్తోంది. వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే సినిమా చూసిన తర్వాత రాజమౌళి ఎలాంటి రివ్యూ ఇస్తాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నిజానికి భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజైన 'గేమ్ ఛేంజర్' సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. మెగా ఫ్యాన్స్ మూవీ బాగుందని అంటుంటే, జనరల్ ఆడియన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని అంటున్నారు. దీనికి తగ్గట్టుగానే సమీక్షకులు రివ్యూలు కూడా యావరేజ్ గా ఉన్నాయి. రామ్ చరణ్ తన పాత్రల వరకూ న్యాయం చేసినప్పటికీ.. కథ, కథనంలో కొత్తదనం లేకపోవడం నిరాశ కలిగించిందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజమౌళి ఈ సినిమాపై ఎలాంటి ఆలోచనలు పంచుకుంటారో అని అంతా వేచి చూస్తున్నారు.
దర్శక ధీరుడు రాజమౌళితో వర్క్ చేసిన హీరోల తర్వాతి సినిమాలు ఫ్లాప్ అవుతాయనే బ్యాడ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. అయితే RRR తర్వాత 'దేవర' సినిమాతో హిట్టు కొట్టి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మిత్ బ్రేకర్ అనిపించుకున్నారు. కానీ గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ మాత్రం 'ఆచార్య' మూవీతో తన తండ్రితో కలిసి డిజాస్టర్ అందుకున్నారు. ఇప్పుడు 'గేమ్ ఛేంజర్' సినిమాతో సక్సెస్ సాధిస్తారని అందరూ భావించారు. జక్కన్న సైతం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు వెళ్లి తన బెస్ట్ విషెస్ అందజేశారు. కానీ సినిమా ఏమంత గొప్పగా లేదని టాక్ ని బట్టి తెలుస్తోంది. మరి సంక్రాంతి బాక్సాఫీసు దగ్గర మెగా మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి.
"గేమ్ ఛేంజర్" చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా.. ఎస్‌జె సూర్య, అంజలి, శ్రీకాంత్, సునీల్, జయరామ్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు.