సంక్రాంతి సినిమాలకు టికెట్‌పై అద‌నం ఎంత?

భారీ హైప్ న‌డుమ విడుద‌ల‌వుతున్న గేమ్ ఛేంజ‌ర్ కి టికెట్ రేట్ల‌ను పెంచుకునే వెసులుబాటును క‌ల్పిస్తూ తాజాగా ఏపీ ప్ర‌భుత్వం జీవోని జారీ చేసింది.

Update: 2025-01-05 06:40 GMT

గ్లోబ‌ల్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ తెర‌కెక్కించిన 'గేమ్ ఛేంజ‌ర్' పాన్ ఇండియా కేట‌గిరీలో అత్యంత భారీగా విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగతి తెలిసిందే. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్ జనవరి 10 న థియేటర్లలో విడుదల కానుంది. భారీ హైప్ న‌డుమ విడుద‌ల‌వుతున్న గేమ్ ఛేంజ‌ర్ కి టికెట్ రేట్ల‌ను పెంచుకునే వెసులుబాటును క‌ల్పిస్తూ తాజాగా ఏపీ ప్ర‌భుత్వం జీవోని జారీ చేసింది. దాని వివ‌రాలు ఇలా ఉన్నాయి.

సింగిల్ స్క్రీన్‌లలో రూ. 135 (జిఎస్‌టితో సహా) .. మల్టీప్లెక్స్‌లలో రూ. 175 (జిఎస్‌టితో సహా) మేర 'గేమ్ ఛేంజర్' టిక్కెట్ రేట్ల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 10న 6 షోల వరకు (మధ్యాహ్నం 1 గంటలకు బెనిఫిట్ షోలు సహా) అనుమతిస్తూ జీవో జారీ చేసింది. బెనిఫిట్ షోలు ఒక్కో టిక్కెట్‌పై రూ. 600 (జీఎస్టీ సహా) కి పరిమితం చేసారు. జనవరి 11 నుండి గేమ్ ఛేంజర్ ఆంధ్రప్రదేశ్ అంతటా సింగిల్ స్క్రీన్‌లు , మల్టీప్లెక్స్‌లలో రోజుకు 5 షోలు వేసుకునే వెసులుబాటు క‌ల్పించింది. టిక్కెట్ల ధ‌ర‌ల‌ పెంపు, అదనపు ప్రదర్శనలు జనవరి 23 వరకు కొనసాగుతాయి.

ప్ర‌భుత్వం క‌ల్పించిన వెసులుబాటు కార‌ణంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద‌ 2 వారాల పాటు భారీగా ఆర్జించే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ చిత్రంలో కియ‌రా అద్వాణీ క‌థానాయిక‌. దిల్ రాజు నిర్మించారు. గేమ్ ఛేంజర్‌లో ఎస్‌జె సూర్య, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బరాజ్ స్క్రిప్ట్ అందించ‌గా, శంక‌ర్ తెర‌కెక్కించారు. ఈ చిత్రానికి తమన్ స్వరకర్త.

డాకు మహారాజ్ కి టికెట్ పెంపు:

న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ న‌టించిన యాక్షన్ డ్రామా 'డాకు మహారాజ్'కు ఆంధ్రప్రదేశ్ సర్కార్ నుండి టికెట్ పెంపు అనుమ‌తులు ల‌భించాయి. సంక్రాంతి పండుగ సీజన్‌లో రెండు వారాల పాటు డాకు మహారాజ్ సినిమా టిక్కెట్ రేట్ల‌ పెంపును ప్ర‌భుత్వం ఆమోదించింది.

జీవో ప్ర‌కారం.. జనవరి 12న తెల్లవారుజామున 4 గంటల నుండి ప్రారంభమయ్యే 'డాకు మహారాజ్' బెనిఫిట్ షోల టిక్కెట్ ధరలు రూ. 500 (GSTతో సహా) వ‌ర‌కూ అమ్మొచ్చు. డాకు మ‌హారాజ్ జనవరి 12 నుండి 25 వరకు రోజుకు ఐదు షోల ప్రత్యేక సదుపాయాన్ని కూడా పొందింది. ఈ రెండు వారాల టిక్కెట్ ధరలు మల్టీప్లెక్స్‌లకు రూ. 135 (GSTతో సహా), సింగిల్ స్క్రీన్‌లకు రూ. 110 పెంచారు. బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా త‌దిత‌రులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ - ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగ వంశీ - సాయి సౌజన్య దీనిని నిర్మించారు. థ‌మన్ సంగీతం అందించారు.

Tags:    

Similar News