నటికి సైబర్ సెల్ నోటీసులు.. అరెస్ట్ కానుందా?
తాజాగా బాలీవుడ్ నటి రాకీ సావంత్‌కి సైతం ఈ విషయమై నోటీసులు అందాయి.
'ఇండియా గాట్ లాటెంట్' షో గురించి గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం నడుస్తున్న విషయం తెల్సిందే. ఈ షోలో యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యాయి. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సైతం ఈ వివాదం గురించి, అతడి వ్యాఖ్యల గురించి వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు, సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లు సీరియస్‌గా తీసుకున్నాయి. ఇప్పటికే ఈ విషయమై మొత్తం 42 మందికి సమన్లు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా బాలీవుడ్ నటి రాకీ సావంత్‌కి సైతం ఈ విషయమై నోటీసులు అందాయి.
ఆ వివాదాస్పద ఎపిసోడ్‌లో రాకీ సావంత్ లేదు. కానీ ఆ షోలోని ఇతర ఎపిసోడ్స్‌లో రాకీ సావంత్ జడ్జ్‌గా వ్యవహరించారు. అందుకే ఆమెకు నోటీసులు జారీ అయ్యాయి. షోకి సంబంధించిన వారికి అందరికీ నోటీసులు అందాయి. అందులో భాగంగానే రాకీ సావంత్‌ను ఈనెల 27న విచారణకు హాజరు కావాలంటూ సైబర్ సెల్ నోటీసుల్లో పేర్కొంది. ఆ షోకు సంబంధించిన అన్ని ఎపిసోడ్స్‌ను ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా తొలగించారు. ఈ కేసు విషయమై మహారాష్ట్ర సైబర్ సెల్ సీరియస్‌గా ఉంది. స్వయంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు సైతం ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును పరిశీలిస్తున్నారట.
రణ్‌వీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం, ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు, ఆయనతో కలిసి జడ్జ్ ప్యానల్‌లో కూర్చున్న వారి వ్యాఖ్యలన్నింటిని గురించి ఇప్పుడు సైబర్ సెల్ అధికారులు ఎంక్వౌరీ చేస్తున్నారు. చాలా ఎపిసోడ్స్‌లో రాకీ సావంత్ పాల్గొన్నారు. అందుకే ఆమెకు నోటీసులు ఇచ్చి గతంలో ఇలాంటి వ్యాఖ్యలు ఆఫ్ ది రికార్డ్ చేశారా, వాటిని ఆ సమయంలోనే చేస్తారా లేదంటే ముందుగా స్క్రిప్ట్‌లో రాస్తారా అంటూ ప్రతి ఒక్కరిని అడిగినట్లు తెలుస్తోంది. రాకీ సావంత్‌కి నోటీసులు అందడంతో ఈ కేసు వివాదం మరోసారి వార్తల్లో నిలవడం మాత్రమే కాకుండా సైబర్ సెల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలుస్తోంది.
ఇండియా గాట్ లాటెంట్ షో లో పాల్గొన్న ఒక వ్యక్తితో రణ్‌వీర్ అల్హాబాదియా మాట్లాడుతూ అతడి తల్లిదండ్రుల శృంగారం గురించి ప్రశ్నించడం దుమారం రేపింది. అత్యంత జుగుప్సకరమైన ఆ ప్రశ్నపై అన్ని వర్గాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రణ్‌వీర్ అల్హాబాదియా అనే వ్యక్తి యూట్యూబ్ ద్వారా ఎన్నో మంచి విషయాలను చెబుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో జనాలు హర్షించడం లేదు. అందుకే ఈ వివాదం చాలా పెద్దగా మారుతోంది. ముందు ముందు ఈ వివాదం ఎన్ని టర్న్‌లు తీసుకుంటుందో చూడాలి.