ఇదే కొనసాగితే హిందీ భామలంతా ఇంటికెళ్లాల్సిందే!
ప్రత్యేకంగా దక్షిణాది దర్శకుల్ని బాలీవుడ్ ఆహ్వనించి మరీ అవకాశాలు కల్పిస్తున్నారు.
బాలీవుడ్ లో సౌత్ భామల హవా పెరుగుతోందా? సొంత హీరోయిన్లనే హిందీ మేకర్లు పక్కన బెడుతున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. సౌత్ ఇండస్ట్రీ పాన్ ఇండియాలో సంచలనమైన తర్వాత బాలీవుడ్ లో ఎన్నో మార్పు లొచ్చాయి. సౌత్ మార్కెట్ పై నార్త్ హీరోలంతా దృష్టి పెట్టడం మొదలు పెట్టారు. సౌత్ దర్శకులతో , హీరోలతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకంగా దక్షిణాది దర్శకుల్ని బాలీవుడ్ ఆహ్వనించి మరీ అవకాశాలు కల్పిస్తున్నారు. మునుపెన్నడు ఇలాంటి సన్నివేశం బాలీవుడ్ లో చోటు చేసుకోలేదు.
అంతేనా సౌత్ హీరోయిన్లకు బాలీవుడ్ లో పెద్ద పీట వేయడం మొదలైంది. 'జవాన్' విజయం తర్వాత నయనతార కు బాలీవుడ్ లో నటించమని ఎంతో మంది ఆఫర్ చేసారు. కానీ నయన్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. కోలీవుడ్ కి ఇచ్చిన ప్రాధాన్యత ఇతర పరిశ్రమలకు ఇవ్వడం లేదు. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్నా 'యానిమల్' తర్వాత అక్కడ మరింత ఫేమస్ అయింది. మూడేళ్లగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. స్టార్ హీరోల సరసన అవకాశాలు అన్నీ తనవే అన్నట్లుగా దూసుకుపోతుంది.
బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవికి ఏకంగా తొలి సినిమా రాక్ స్టార్ రణబీర్ కపూర్ తోనే నటించే ఛాన్స్ వచ్చింది. 'రామాయణం' చిత్రం కోసం నితీష్ తివారీ బాలీవుడ్ హీరోయిన్లు అందర్నీ పక్కనబెట్టి మరీ సాయి పల్లవిని తీసుకున్నారు. 'బేబీజాన్' తో కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా కోసం తొలుత హిందీ భామనే తీసుకోవాలనుకున్నారు. కానీ దర్శకుడు కీర్తికే ప్రాధాన్యత ఇచ్చాడు.
అక్కడే 'అక్కా' అనే వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది కీర్తి సురేష్. ప్రతిష్టాత్మక యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తోన్న సిరీస్ ఇది. ఇందులో అవకాశం అంత ఈజీ కాదు. ఎంతో మంది భామల్ని దాటుకుని కీర్తిని ఆ అవకాశం వరించింది. ఇలా సౌత్ భామలు నార్త్ కి వెళ్లిన ప్రతీసారి అక్కడ అవకాశాలు హిందీ భామలు కోల్పోవాల్సి వస్తోంది. ముఖ్యంగా యువ నాయికలపై ప్రభావం పడుతుంది.