గుసగుస: 'పుష్ప2'ని ఆస్కార్‌కు తీసుకెళతారా?
ఇక ఇప్పుడు బన్నీ టైమ్ వచ్చింది. అతడు స్టార్ గా మరో స్థాయికి ఎదిగేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం గెలుచుకోవడంతో టాలీవుడ్ లో సంబరాలు మిన్నంటాయి. అతడి ప్రతిభ హార్డ్ వర్క్ కి తగ్గ పురస్కారం దక్కింది! అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరోవైపు అల్లు కుటుంబం ఈ విజయాన్ని భారీగా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఇప్పుడు అల్లు ఇంట ఆనందానికి అవధుల్లేవ్.
మరోవైపు బన్నికి సన్మానాలు సత్కారాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సినీ, రాజకీయ రంగ ప్రముఖులు అల్లూ అర్జున్ ని సత్కరిస్తున్నారు. శాలువాలతో సన్మానిస్తున్నారు. నిన్నటిరోజున హరియాణా గవర్నర్ గా గొప్ప హోదాలో కొనసాగిన భాజపా సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ స్వయంగా బన్ని ఇంటికి వచ్చి శాలువాతో సత్కరించారు. పుష్ప చిత్రంతో జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్న తెలుగు నటుడికి దక్కిన గొప్ప సన్మానంగా దీనిని భావించాలి.
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించడంతో ఇప్పుడు అందరి కళ్లు తనవైపే ఉన్నాయి. అటు బాలీవుడ్ నుంచి ఇక ఉధృతమైన ఆఫర్లు వెల్లువెత్తేందుకు ఆస్కారం ఉందని కూడా భావిస్తున్నారు. ఇప్పుడున్న పాన్ ఇండియా హీరోలకు బన్ని ధీటైన పోటీని ఇవ్వనున్నాడు.
ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ చిత్రం 'వార్ 2'లో అవకాశం అందుకున్నాడు. హృతిక్ తో కలిసి అతడు నటిస్తున్నాడు. ఇదిలా ఉండగానే చరణ్ - మహేష్ కూడా బాలీవుడ్ లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారన్న సమాచారం ఉంది. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా ఏల్తున్నాడు.
ఇక ఇప్పుడు బన్నీ టైమ్ వచ్చింది. అతడు స్టార్ గా మరో స్థాయికి ఎదిగేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు. పాన్ ఇండియా .. పాన్ వరల్డ్ మార్కెట్లలో ఇప్పటికే బన్నీకి గ్రిప్ ఉంది. ఈ హవా ఇకపై మరింతగా పెరగనుందని కూడా అంచనా వేస్తున్నారు.
నిజానికి 'పుష్ప 2'కి హాలీవుడ్ లో ప్రచారం కావాలని భావిస్తున్నాడు. ఆస్కార్ స్థాయిలో ప్రచారం చేయడం ద్వారా తన ఇమేజ్ కూడా పెరుగుతుందని కూడా అంచనా వేస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ తరహా ప్రమోషన్ కావాలని కోరుకుంటున్నాడు. దానికి తగ్గట్టు పెద్ద ప్రణాళికలు ఉన్నాయని కూడా వెల్లడించాడు బన్ని. ఆస్కార్ బరిలో పోటీపడడం .. గోల్డెన్ గ్లోబ్స్ కి గురి పెట్టడం.. హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారాల్లో సందడి చేయడం వగైరా విషయాలు బన్నీకి కలిసొస్తాయనడంలో సందేహం లేదు. మునుముందు భారతీయ సినిమా దేశ విదేశాల్లో మార్కెట్లను గుప్పిట పట్టాలని అల్లు అర్జున్ భావిస్తున్నారు. ఈ అంచనాలు నిజమయ్యేందుకు మరో ఐదారేళ్ల సమయం సరిపోతుందన్న ఊహాగానాలు కూడా సాగుతున్నాయి.