యశ్ 'టాక్సిక్' పుకార్లకు చెక్
సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత యశ్ తన తదుపరి సినిమాను గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో అంటూ అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.
కన్నడ స్టార్ యశ్ 'కేజీఎఫ్' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా నిలిచారు. ఆయన కేజీఎఫ్ రెండు పార్ట్ లు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో తదుపరి సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. ముఖ్యంగా కేజీఎఫ్ 2 సినిమా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే. రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు నమోదు చేసిన తర్వాత యశ్ తన తదుపరి సినిమా కోసం చాలా సమయం తీసుకున్న విషయం తెల్సిందే. సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత యశ్ తన తదుపరి సినిమాను గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో అంటూ అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.
కేజీఎఫ్ వంటి భారీ యాక్షన్ సినిమాను చేసిన తర్వాత ప్రేక్షకులు ఆయన నుంచి వరుసగా అలాంటి సినిమాలనే ఆశిస్తున్నారు. కానీ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో విభిన్న చిత్రాన్ని చేయడం కోసం యశ్ రెడీ అయ్యాడు. టాక్సిక్ అనే టైటిల్ తో రూపొందుతున్న వీరి కాంబో మూవీ ఇటీవలే పట్టాలెక్కింది. ఆ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ కు ఎక్కువ సమయం పట్టడంతో అంతా అసలు సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. కొన్ని కన్నడ మీడియా సంస్థలు టాక్సిక్ సినిమాను పక్కన పెట్టారు, యశ్ ఇప్పటి వరకు వచ్చిన ఔట్ పుట్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మీడియాలో టాక్సిక్ గురించి వస్తున్న పుకార్లపై చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా స్పందించారు. సినిమా క్యాన్సల్ అయిందని, ఔట్ పుట్ విషయంలో అసంతృప్తితో ఉన్నారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అన్నారు. అంతే కాకుండా సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, భారీ ఎత్తున యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం సెట్ ను నిర్మిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్ కోసం యశ్ సైతం రెడీ అవుతున్నట్లుగా మేకర్స్ చెప్పుకొచ్చారు. కన్నడ సినిమా ఇండస్ట్రీతో పాటు అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది.
టాక్సిక్ సినిమాను వచ్చే ఏడాది భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో యశ్ కి జోడీగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇతర ముఖ్య పాత్రల్లో నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా వంటి ప్రముఖులు నటించబోతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా ను విభిన్నమైన కాన్సెప్ట్ తో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు, యశ్ స్థాయిని, స్టార్ డమ్ ను పాన్ ఇండియా రేంజ్ లో మరింతగా పెంచేందుకు గాను ప్లాన్ చేస్తున్నారు.