కావచ్చు కాకపోవచ్చు.. విడాకుల పుకార్ల‌పై చాహల్

ప్రస్తుతానికి చాహ‌ల్-ధ‌న‌శ్రీ వ్య‌క్తిగ‌త జీవితంపై మీడియా ఊహాగానాలు య‌థేచ్ఛ‌గా సాగిపోతున్నాయి.

Update: 2025-01-10 04:09 GMT

ప్ర‌తిభావంతుడైన టీమిండియా ఆట‌గాడు యుజ్వేంద్ర చాహల్ - న‌టి ధనశ్రీ వర్మ విడాకుల గురించి కొద్దిరోజులుగా పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ జంట సోషల్ మీడియాల్లో ఒక‌రినొక‌రు అన్ ఫాలో చేసుకోవ‌డం.. స్థ‌బ్ధుగా ఉండ‌టం.. విడిపోవ‌డానికి సంకేతం! అంటూ ప్ర‌చారం మొద‌లైంది. అయితే ఈ వార్త‌ల్ని చాహ‌ల్- ధ‌న‌శ్రీ జంట‌ ఖండించ‌నూ లేదు... అవును! అని కూడా అంగీక‌రించ‌లేదు.


ప్రస్తుతానికి చాహ‌ల్-ధ‌న‌శ్రీ వ్య‌క్తిగ‌త జీవితంపై మీడియా ఊహాగానాలు య‌థేచ్ఛ‌గా సాగిపోతున్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త సిద్ధాంతాలు కూడా పుట్టుకొస్తున్నాయి. మీమ్స్, ఈమోజీ షేరింగ్ వంటి వాటికి కొద‌వే లేదు. ఇంత‌కుముందు ధ‌న‌శ్రీ వ‌ర్మ ఈ పుకార్ల‌పై స్పందించారు. త‌ప్పుడు క‌థ‌నాల‌తో త‌న క్యారెక్ట‌ర్ ను హ‌త్య చేసేందుకు ప్ర‌య‌త్నించార‌ని మీడియాపై ధ‌న‌శ్రీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు.

తాజాగా చాహ‌ల్ స్పందించారు. తన ఇన్ స్టాలో సుదీర్ఘ నోట్ లో చాలా విష‌యాలు రాసారు. ప్ర‌యాణం ముగిసిపోయింది అన‌డానికి ఇంకా చాలా దూరం ఉంది! అని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేసారు. చాహ‌ల్ రాసిన లేఖ‌లో ఇలా ఉంది. ``ప్రయాణం ముగిసిపోయింది అనే దానికి చాలా దూరం ఉంది.. ఎందుకంటే నా దేశం, నా జట్టు, నా అభిమానుల కోసం ఇంకా చాలా అద్భుతమైన ఓవర్లు మిగిలి ఉన్నాయి!... క్రీడాకారుడిగా ఉన్నందుకు నేను గ‌ర్విస్తున్నాను. నేను ఒక కొడుకుని.. సోద‌రుడిని.. స్నేహితుడిని కూడా... నా చుట్టూ ఉన్న విష‌యాల‌పై మీ ఉత్కంఠ‌ను గ‌మ‌నించానని అన్నారు. ముఖ్యంగా నా వ్య‌క్తిగ‌త జీవితం గురించి....! ``మీరు విన్న‌వి నిజం కావచ్చు లేదా కాకపోవచ్చు .. ఊహాగానాలలో తేలిపోవ‌ద్దు`` అని చాహ‌ల్ రాసారు.

సానుభూతి కాదు.. అందరి ప్రేమ, మద్దతును కోరుకోవడానికి తాను ఎప్పటికీ ప్రయత్నిస్తానని చాహ‌ల్ వ్యాఖ్యానించారు. అయితే అత‌డి వ్య‌క్తిగ‌త జీవితంపై పుకార్ల‌ను అత‌డు ఖండించ‌ను లేదు... అలాగ‌ని ఔన‌ని అంగీక‌రించ‌నూ లేదు. `కావచ్చు లేదా కాకపోవచ్చు` అంటూ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌ను త‌న లేఖ‌లో జోడించాడు. ధ‌న‌శ్రీ‌-చాహ‌ల్ జంట త‌మ మ‌ధ్య ఏం జ‌రుగుతోందో వారు మాత్ర‌మే అధికారికంగా వెల్లడించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతానికి మీడియాలో వ‌స్తున్న‌వ‌న్నీ ఊహాగానాలుగానే ప‌రిగ‌ణించాలి.

Tags:    

Similar News