రొట్టె తింటే బరువు తగ్గుతారా ?
రొట్టెలో గ్లూటెన్ ఉంటే బియ్యంలో ఉండదు. కొందరికి గ్లూటెన్ ఇష్టముండదు. అలాంటి వారు తక్కువ మొత్తంలో రొట్టె, ఎక్కువ మొత్తం అన్నం తీసుకుంటే మంచిదంటున్నారు.
కూర్చుని తింటే కొండలు కరుగుతాయి అని పెద్దలు చెప్పిన సామెతలో ఎంత నిజం ఉందో .. తిని కూర్చుంటే కొండలా బరువు పెరగడం కూడా అంతే గ్యారంటీ అంటున్నారు నిపుణులు. ఎంతో కొంత శారీరక శ్రమ చేయకుంటే లావెక్కిపోవడం గ్యారంటీ. ఈ నేపథ్యంలో కష్టం చేసే వారు శ్రమకు తగ్గట్లు అన్నం లాగించేస్తుంటే, ఎలాంటి శారీరక శ్రమలేక పోవడం, కూర్చుని ఉద్యోగాలు చేసే వాళ్లు బరువు పెరిగిపోయి బరువు తగ్గడానికి రొట్టెలు తినడానికి ఆసక్తి చూపుతున్నారు.
మరి నిజంగా రొట్టెలు తింటే బరువు తగ్గుతారా ? అంటే బరువు కంట్రోల్ లో ఉంటుంది కానీ అచ్చం రొట్టెలే తినడం చేయకూడదని, అలాగని ఎప్పుడూ ఆకలితో కూడా ఉండకూడదని, ఇది ఆరోగ్యాన్ని మరింత ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బియ్యం, రొట్టె ఈ రెండింటి పోషక విలువల్లో చాలా తేడా ఉంటుంది. బరువు తగ్గాలనేవారు ఈ రెండూ తినాలని చెబుతున్నారు. వారానికి 4 రోజులు రొట్టె తింటే 2 రోజులు అన్నం తినాలని, ఇలా చేస్తే బరువు కంట్రోల్‌లో ఉంటుందని అంటున్నారు.
రొట్టెలో గ్లూటెన్ ఉంటే బియ్యంలో ఉండదు. కొందరికి గ్లూటెన్ ఇష్టముండదు. అలాంటి వారు తక్కువ మొత్తంలో రొట్టె, ఎక్కువ మొత్తం అన్నం తీసుకుంటే మంచిదంటున్నారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు అన్నం కంటే రొట్టె తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు సలహా ఇస్తున్నారు. జొన్నలు, రాగులు, ఇతర చిరుధాన్యాలతో చేసిన రొట్టెలు బరువు తగ్గడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. ఎందుకంటే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇన్సులిన్ స్థాయి పెరగదు.
అంతేకాకుండా ఇవి చాలా పోషకమైనవి. బరువు తగ్గించడంలో చాలా సాయపడుతా యి. ఒకవేళ అన్నం తింటూ బరువు తగ్గాలనుకుంటే బ్రౌన్ రైస్ మంచివి అని, ముఖ్యంగా మనం తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలని అంటున్నారు.