డ్యాన్స్ చేస్తున్నారా... శృతిమించితే గుండె చేతులెత్తేస్తుంది జాగ్రత్త!
ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా.. శరీర బరువుతో సాపత్యం లేకుండా చాలామంది గుండెపోటుకు గురవుతున్న సంగతి తెలిసిందే.
ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా.. శరీర బరువుతో సాపత్యం లేకుండా చాలామంది గుండెపోటుకు గురవుతున్న సంగతి తెలిసిందే. జిం చేస్తూ గుండెపోటుకు గురవుతున్నవారు కొంతమందైతే... జాగింగ్ చేస్తూ మరణిస్తున్నవారు ఇంకొంతమంది. అయితే అంతకంటే ఎక్కువగా డ్యాన్స్ చేస్తూ మరణిస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. ఈ క్రమంలో గార్భా డాన్స్ చేస్తూ 24 గంటల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
అవును... ఇటీవల డ్యాన్స్ చేస్తూ ఉన్నపలంగా పడిపోయి తిరిగిరాని లోకాలకు వెళ్తున్నవారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుజరాత్ ప్రజలు గార్భా డాన్స్ చేస్తున్న సంఘటనలు విషాదాంతం అవుతున్నాయి. డ్యాన్స్ చేస్తూ పడిపోవడం.. అనంతరం వారిని హుటాహుటున ఆసుపత్రికి తీసుకెళ్లడం.. ఈ లోపే వారు మరణించారని చెప్పడం జరుగుతున్నాయి!
ఈ క్రమంలో కేవలం 24 గంటల్లో ఏకంగా 10 మంది సడన్ గా ప్రాణాలు కోల్పోయారు. ఈ చనిపోయిన వారిలో పిల్లలు, పెద్దలూ, పురుషులూ, మహిళలూ అన్ని వయసుల వారూ ఉన్నారు. అయితే వీరిందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏమిటంటే... వారంతా డ్యాన్స్ చేయడం. అలా డ్యాన్స్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడం!
వీరిలో దభోయ్ కి చెందిన 13 ఏళ్ల బాలుడు.. గార్భా ఆడుతూ హార్ట్ ఎటాక్ తో చనిపోగా.. అహ్మదాబాద్ కు చెందిన 24 ఏళ్ల యువకుడు గార్భా ఆడుతూ ఉన్నపలంగా కింద పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్దాం అనుకునేలోపు స్పాట్ లోనే ప్రాణం విడిచాడు. ఇదే క్రమంలో... కపద్వాంజ్ లో 17 ఏళ్ల కుర్రాడు కూడా గార్భా ఆడుతూ ఒక్కసారిగా ప్రాణాలు విడిచాడు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే... ఇలాంటివి ఎన్నో సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి!
ఇలా వయసుతో సంబంధం లేకుండా.. దాదాపు అన్ని వయసుల వారూ డాన్స్ చేస్తున్నప్పుడు గుండెపోటుకు గురవ్వడంపై వైద్యులు స్పందింస్తున్నారు. ఎందుకు డ్యాన్స్ చేసేటప్పుడే హార్ట్ ఎటాక్ వస్తోందన్నది విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా... సాదారణంగా గుండె ఓ స్థాయికి మించి రక్తాన్ని వేగంగా పంపిణీ చెయ్యలేదని.. ఆ స్థాయి దాటితే గుండె చేతులెత్తేస్తుందని.. దీంతో ఒక్కసారిగా పనిచేయడం మానేస్తుందని చెబుతున్నారు.
అయితే ఇది కేవలం అతిగా డ్యాన్స్ చేసే సమయంలోనే కాకుండా... చాలా సందర్భాల్లో అతిగా ఎక్సర్ సైజ్ చేసేటప్పుడూ, వేగంగా పరుగెత్తేటప్పుడూ కూడా గుండెపై అధిక భారం పడుతుందని అంటున్నారు. దాంతో గుండె రక్తాన్ని పంపింగ్ చెయ్యలేక స్ట్రక్ అయ్యిపోతుందని చెబుతున్నారు. అందువల్ల గుండెను ఎక్కువగా ఇబ్బంది పెట్టొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అందుకే... డ్యాన్స్ చేస్తున్నా, జిం చేస్తున్నా, జాగింగ్ చేస్తున్నా, ఏ పనిచేస్తున్నా ఆయాసంగా అనిపిస్తే ఆ పని ఆపేసి 10 నిమిషాలు గుండెకు విశ్రాంతి ఇవ్వాలని సూచిస్తున్నారు. ఎక్సర్ సైజులు చేసేటప్పుడు కూడా ప్రతీ 10 నిమిషాలకూ మధ్య కనీసం 2 - 3 నిమిషాల విరాం ఇవ్వాలని చెబుతున్నారు! అలాకానిపక్షంలో మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా గుండె అలసిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు!