3 వారాల్లో 5 వేల ఇంజెక్షన్లు ఇచ్చి ఆ యువకుడ్ని బతికించిన వైద్యులు
అవును.. మీరు చదివింది నిజం. ఒక యువకుడ్ని కాపాడేందుకు రాజస్థాన్ కు చెందిన వైద్యులు చేసిన ఈ ఉదంతం విస్మయానికి గురి చేస్తోంది.
అవును.. మీరు చదివింది నిజం. ఒక యువకుడ్ని కాపాడేందుకు రాజస్థాన్ కు చెందిన వైద్యులు చేసిన ఈ ఉదంతం విస్మయానికి గురి చేస్తోంది. కేవలం 24 రోజుల వ్యవధిలో 5వేల ఇంజెక్షన్లు ఇవ్వటం ఒక రికార్డుగా చెబుతున్నారు. చావుబతుకుల మధ్య ఉన్న అతడ్ని కాపాడేందుకు శతవిధాలుగా ప్రయత్నించిన వారు.. చివరకు తాము అనుకున్నది సాధించగలిగారు. ప్రాణాలు కాపాడటమే కాదు.. అతడ్ని క్షేమంగా ఇంటికి పంపారు. సూసైడ్ చేసుకొని చావుబతుకుల మధ్య తమ వద్దకు వచ్చిన యువకుడి ప్రాణాల్ని కాపాడేందుకు వారు చేసిన ప్రయత్నం ఇప్పుడు చర్చగా మారింది.
రాజస్థాన్ కు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి పెళ్లి కాలేదు. ఎంత ప్రయత్నం చేసినా సంబంధం కుదరకపోవటంతో తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన అతడు.. జీవితం మీద విరక్తికి లోనయ్యాడు. దీంతో ‘ఆర్గానో ఫాస్పరస్’ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ పురుగు మందు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పురుగుల నుంచి పంటను కాపాడుకోవటానికి ఈ పవర్ ఫుల్ మందును స్ప్రే చేస్తారు.
ఇదెంత శక్తివంతమైందంటే.. ఆ పురుగుమందు చల్లిన తర్వాత మూడు నెలల పాటు పురుగులు ఆ పంట జోలికి రాలేవు. అలాంటి మందు తాగటంతో అతడ్ని సేవ్ చేయటం పెద్ద సవాలుగా మారింది. చావుబతుకుల మధ్య తమ వద్దకు వచ్చిన ఆ యువకుడ్ని బంగర్ మెడికల్ కాలేజీ వైద్యులు పెద్ద ఎత్తున వైద్య సేవలు అందించారు. ఆసుపత్రికి వచ్చే సమయానికి అతని పరిస్థితి విషమంగా ఉండటమే కాదు.. బతికే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో.. అతడ్ని కాపాడేందుకు వారు నిర్విరామంగా మందులు ఇవ్వాల్సి వచ్చింది.
మొత్తంగా 24 రోజుల వ్యవధిలో 5 వేల ఇంజెక్షన్లు ఇచ్చారు. ఇరవై రోజుల పాటు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. చివరకు వైద్యుల ప్రయత్నం ఫలించింది. 24 రోజుల తర్వాత అతడ్ని క్షేమంగా ఇంటికి పంపారు. అతడ్ని కాపాడే విసక్ష్ంలో పలువురు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినట్లుగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ దీపక్ వర్మ పేర్కొన్నారు. ఈ ఉదంతం వైద్యరంగంలో ఆసక్తికర చర్చగా మారింది.