ఆయువు తీస్తున్న వాయువు.. ఆత్మహత్యలకు కారణమదే
జీవకోటికి ప్రాణాధారం వాయువు.. అది లేనిదే మనుగడ అసాధ్యం. కానీ, అలాంటి వాయువే ఆయువు తీస్తుందట..?
జీవకోటికి ప్రాణాధారం వాయువు.. అది లేనిదే మనుగడ అసాధ్యం. కానీ, అలాంటి వాయువే ఆయువు తీస్తుందట..? మీర నమ్ముతారో లేదో.. ఇది నిజం. పరిశోధనల్లో తేలిన వాస్తవం. వీటిని ఆపడం ఎలా..? అది అంత సులభం కాదని కూడా తేలింది. ఒకవిధంగా చెప్పాలంటే బలవన్మరణాలు.. ప్రజారోగ్యంలో అతి పెద్ద సమస్య అని కూడా చెప్పాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) లెక్కల ప్రకారమే చూస్తే ఏటా 7 లక్షల మంది తమంతట తాము జీవితాలను చాలిస్తున్నారు. ఇందులోనూ అగ్రరాజ్యం అమెరికాదే మెజారీటీ వాటా. అంతేకాదు.. 20 ఏళ్లలలో అమెరికాలో ఆత్మహత్యల సంఖ్య 40 శాతం పెరిగిందంటే నమ్ముతారా? దీన్నిబట్టే నాగరికత ఎంత పెరుగుతోందో అంతే స్థాయిలో బలవన్మరణాలూ పెరుగుతున్నట్లు తెలియడం లేదూ..?
ఏడాదిలోనే 50 వేలమంది?
అమెరికా అంటే కలల రాజ్యం. డాలర్ల స్వర్గం. అంతేకాదు.. బలవనర్మణాల రాజధాని కూడా అనాలేమో? ఎందుకంటే అక్కడ నిరుడు 50 వేల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రతి 11 నిమిషాలకు ఒకరు ప్రాణం తీసుకున్నారు. యూకేలో ఆత్మహత్యలు అమెరికా కంటే 25 శాతం తక్కువట. మరి ఈ మరణాలను తగ్గించడం ఎలా? అందుకు ఉన్న పరిష్కారం ఏమిటనే విషయాలను ఓ అధ్యయనం వెల్లడించింది. మానసిక ఆరోగ్య సంరక్షణ, ఒంటరితనాన్ని దూరం చేయడం అనే రెండు మార్గాలను సూచించింది.
డెన్మార్క్ భేష్
స్కాండినేవియన్ దేశం డెన్మార్క్. అనేక ప్రమాణాలతో పాటు ఆరోగ్య ప్రమాణాల్లోనూ ఈ దేశం ముందుంటుంది. ఇలాంటి దేశంలో ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వ్యక్తుల కోసం ప్రత్యేకంగా ఆత్మహత్య నిరోధక కేంద్రాల ఏర్పాటు చేసి ఫలితాలు పొందారు. బలవంతంగా తనువు చాలించాలన్న ఆలోచనలు ఉన్న వారిని ఈ కేంద్రాల్లో చేర్చి వారిలో మార్పు తెచ్చి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల నుంచి బయట పడేశారు. ఇది ఐదేళ్ల కిందటే చేశారు. ఇప్పుడు ఆత్మహత్యల నివారణ దిశగా సరికొత్త పరిశోధన జరుగుతోంది.
గాలిపై పరిశోధనలు...వాయు కాలుష్యంపై
గాలి నాణ్యత/స్వచ్ఛతకు ఆత్మహత్యలకు మధ్య ఉన్న సంబంధాన్ని పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. కొన్నేళ్లుగా పెరిగిన వాయు కాలుష్యానికి, ఆత్మహత్యలకు మధ్య సంబంధాన్ని కొన్ని అధ్యయనాల్లో గుర్తించారు. యేల్ యూనివర్సిటీకి చెందిన సీయుల్కీ హియో, ఆమె కొలిగ్స్.. వాయు కాలుష్యానికి, ఆత్మహత్యలకు మధ్య ఉన్న సంబంధంపై నిర్వహించిన 18 అధ్యయనాలను సమీక్షించారు. కలప దహనం. అడవులు దగ్ధం కావడం, భవన నిర్మాణాల సమయంలో విడుదలయ్యే ధూళి, పరిశ్రమలు విడుదల చేసే వాయువులు, ఇంధనాలు మండడం వల్ల, వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాటి కారణంగా ఆత్మహత్యల ప్రమాదం పెరుగుతున్నట్లు వారు గుర్తించారు. లండన్‌లోని యూనివర్సిటీ కాలేజీకి చెందిన ఇసోబెల్ బ్రెయిత్‌వెయిట్ నేతృత్వంలో నిర్వహించిన పరిశోధనపై 2019లో జరిగిన సమీక్షలోనూ కొన్ని విషయాలు వెల్లడయ్యాయి.
కాలుష్యం మూడు రోజులు మించితే..
ఈ అధ్యయనాల ప్రకారం విశ్లేషిస్తే.. వాయు కాలుష్యం మూడు రోజుల పాటు ఎక్కువగా ఉంటే ఆత్మహత్యలకు ప్రేరేపించే ఆలోచనలు పెరుగుతోంది. దీర్ఘకాలిక వాయుకాలుష్యం కుంగుబాటును పెంచే ప్రమాదం కూడా ఉంది. కాగా, దీనిపై యూరప్, ఆసియాలో అనేక అధ్యయనాలు జరిగాయి. ఇటీవల అమెరికా డేటాను విశ్లేషించినప్పుడు నగరాల్లో ఒక క్యూబిక్ మీటర్‌కు ఒక మైక్రో గ్రాము చొప్పున గాలిలో కాలుష్యకారకాలు పెరిగినప్పుడు రోజువారీ ఆత్మహత్యల రేటు 0.5 శాతం పెరిగినట్లు కేంబ్రిడ్జ్‌లోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ తన అధ్యయనపత్రంలో ప్రచురించింది. ఇతర అధ్యయనాల మాదిరిగా ఈ ప్రత్యేక పరిశోధన ప జీవక్రియ ఎలా ఉండొచ్చనే విషయం కచ్చితంగా తెలియదు కానీ పరిశోధకులకు మాత్రం అనుమానాలున్నాయి.
కాలుష్యం ఎలా కారణమవుతుంది...
ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే కాలుష్యం రక్తప్రవాహంలోకి, ఆపై మెదడుకు ఆక్సిజన్ సరఫరాను నిరోధించడం ద్వారా బలవన్మరణాలను ప్రేరేపిస్తుందని గుర్తించారు. ఇతర బలహీనతలకు కూడా దారితీస్తుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. కాలుష్యం మెదడులో వాపునకు దారితీయొచ్చని, అందువల్ల సెరోటోనిన్ లోటు ఏర్పడి ఒత్తిడికి గురైనప్పుడు ప్రతిస్పందించే పద్ధతులకు అంతరాయం కలిగిస్తుందని కొందరు పరిశోధకులు అనుమానిస్తున్నారు. ఇది నిరాశ, నిస్పృహలకు దారితీసే అవకాశాలను పెంచుతుంది. చెడు గాలి మనుషుల ఆలోచనలను ప్రభావితం చేయడంతో పాటు, అది మెదడును పొగమంచులా చుట్టేసి వారికి తెలియకుండానే ఆత్మహత్య ఆలోచనలను ప్రోత్సహించే అవకాశం ఉంది. సంబంధం ఉందని తెలియజేసే సారూప్యతలపైకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి పరిశోధనలోనూ ఇతర విషయాలపై ప్రభావాన్ని కూడా పరిశీలించిన తరహాలోనే ఇతర పర్యావరణ ప్రభావాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న రోజుల్లో ఆత్మహత్యలు ఎక్కువగా జరిగినట్లు కనుగొన్నారు. ఉష్ణోగ్రతలు 7 సెల్సియస్ పెరిగితే, ఆత్మహత్యల రేటు 9 శాతం పెరిగిందని యేల్‌కి చెందని సహ రచయిత మిచెల్ బెల్ వివరించారు.