7 నెలల బాలుడి కడుపులో 2 కేజీల పిండం!
ఏడు నెలల చిన్నారి అనారోగ్యానికి గురి కావటంతో వైద్యుల వద్దకు తీసుకెళ్లారు
అరుదైన ఉదంతం ఒకటి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో వెలుగు చూసింది. ఏడు నెలల బాబు పొట్టలో రెండు కేజీల పిండాన్ని గుర్తించిన వైద్యులు.. దాన్ని విజయవంతంగా తొలగించారు. ఇలాంటి ఉదంతాలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. అలాంటిదే ఇటీవల చోటు చేసుకుంది.
ఏడు నెలల చిన్నారి అనారోగ్యానికి గురి కావటంతో వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. కడుపు పరిమాణం అంతకంతకూ పెద్దదికావటంతో ఆందోళనకు గురైన చిన్నారి తల్లిదండ్రులు.. చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ బాబుకు అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయగా.. కడుపులో రెండు కేజీల పిండం ఉన్నట్లుగా గుర్తించారు. సదరు పిండానికి చేతులు.. పాదాలు.. వెంట్రుకలు కూడా వచ్చేసినట్లుగా గుర్తించారు. పిండం వయసు ఆర్నెల్లు ఉంటుందని తేల్చారు.
ఫీటస్ ఇన్ ఫీటూ (పిండంలో పిండం) అనే అరుదైన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లుగా గుర్తించిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్సను చేపట్టారు. విజయవంతంగా దాన్ని తొలగించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సదరు ఆపరేషన్ చాలా సంక్లిష్టమైనదని.. ఏ మాత్రం అప్రమత్తం లేకున్నా కిడ్నీల నుంచి బ్లీడింగ్ అయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
గంటల తరబడి జరిగిన ఈ శస్త్రచికిత్స విజయవంతం కావటంతో ఊపిరి పీల్చుకున్నారు. లక్షల మందిలో ఒక్కరిలో మాత్రమే ఇలా జరుగుతుందని.. తల్లి గర్భాశయంలో కవలలు పెరిగే దశలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు.