కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్‌కు సీఎస్ఐ మార్గదర్శకాలు..
హడావిడి జీవనశైలి అస్తవ్యస్తమైన ఆరోగ్యపు అలవాట్ల కారణంగా మనం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం
హడావిడి జీవనశైలి అస్తవ్యస్తమైన ఆరోగ్యపు అలవాట్ల కారణంగా మనం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం. వీటిలో కొన్ని ముందుగానే కనిపెట్టడం కుదురుతుంది కానీ కొన్ని మాత్రం చాప కింద నీరులా మెల్లిగా మనలను అస్వస్థతకు గురిచేస్తాయి. ఇటువంటి వ్యాధులను సకాలంలో కనుగొనడం వల్ల ప్రాణాపాయ పరిస్థితుల నుంచి తప్పించుకోవడం కుదురుతుంది.
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అసాధారణమైన హెచ్చుతగ్గులను చూపించడం.. కొన్ని సందర్భాలలో గుండెపోటు, పక్షవాతం వంటి వాటికి దారితీస్తుంది. మన రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ సజావుగా లేకపోతే దాని ప్రభావం శరీరంలోని మిగిలిన భాగాలపై కూడా పడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి అధికంగా ఉండడం, చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం,ట్రైగ్లిసెరైడ్స్ అధికమవడం, మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోవడం వంటివి డిస్లిపిడెమియా పరిధిలోకి వస్తాయి. అందుకే డిస్లిపిడెమియా ను నివారించడం కోసం తొలిసారిగా మన దేశంలో కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా
(సీఎస్ఐ) కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
సరియైన సమయంలో వీటిని గుర్తించడం ఎంతో అవసరం. ఎందుకంటే ఎర్లీ స్టేజ్ లో వీటికి చికిత్స అందించకపోతే కాలక్రమంలో గుండె సంబంధిత వ్యాధులకు ఇవి దారితీస్తాయి. హై బీపీ, షుగర్ ఎంత ప్రమాదము ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండకపోవడం కూడా అంతే ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.సీఎస్ఐ విడుదల చేసిన మార్గదర్శకాలు రక్తంలోని కొలెస్ట్రాల స్థాయిలను అదుపులో ఉంచడానికి దోహదపడతాయి.
సాధారణంగా గుండె జబ్బులు వంశపారంపర్యంగా వస్తాయి. మీ ఫ్యామిలీ హిస్టరీలో గుండెజబ్బులు ఉన్నట్లయితే తరచూ రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్ చేయించుకుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా 18 సంవత్సరాల లోపే తొలి లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవడం చాలా మంచిది. మీరు తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నవారు న్యూట్రిషన్ సలహా మేరకు రోజువారి ఆహారంలో మార్పులు తీసుకురావాలి. యోగ, వ్యాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోండి.
రక్తంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు షుగర్, బీపీ వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి. వీలైనంతగా స్ట్రెస్ ని తగ్గించుకోవాలి.
అంతేకాదు కొలెస్ట్రాల్ స్థాయిలో 70 mg/dl కన్నా మించకూడదని సీఎస్ఐ నివేదికలో పేర్కొన్నారు. 20 సంవత్సరాలకు పైగా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి చెడు కొలెస్ట్రాల్ మరింత ప్రమాదకరమని కూడా తెలియపరిచారు.