మటన్ మాంచిగా లాగిస్తున్నారా? అయితే మధుమేహ ముప్పున్నట్లే..

కొన్ని దశాబ్దాల కిందటి వరకు భారతదేశంలో మధుమేహం ఏ కొందరిలోనే ఉండేది.

Update: 2024-09-15 21:30 GMT

నాన్ వెజ్ ప్రియులకు ఒకటే బెంగ.. చికెన్ తిందామంటే.. పట్టణాలు/నగరాల్లో సవాలక్ష సందేహాలు.. కోళ్లకు ఇంజక్షన్లు ఇచ్చి త్వరగా బరువు పెరిగేలా చేస్తున్నారనే ఆరోపణలు.. చేపలు తిందామంటే.. అన్నివేళలా అందుబాటులోకి ఉండవు.. కొన్నిసార్లు ధర కూడా బాగానే ఉంటుంది.. మరి కాస్త కండపుష్టికి.. ఇంకాస్త రుచికి.. ఏం చేయాలి..? దీనికి సమాధానం మటన్. కిలో 800 నుంచి 900 వరకు ఉంటేనేం...? కాస్త నాణ్యమైన, శుభ్రమైన మటన్ దొరికితే చాలు అనుకోవచ్చు. కానీ.. ఇంతలోనే ఓ బాంబు పేల్చారు కేంబ్రిడ్జ్ పరిశోధకులు.

చక్కెర చంపేస్తోంది..

కొన్ని దశాబ్దాల కిందటి వరకు భారతదేశంలో మధుమేహం ఏ కొందరిలోనే ఉండేది. ఇప్పుడు ఇంటింటినీ పలకరిస్తోంది.. కాస్త చదువు, శరీరంలో మార్పులపై అవగాహన ఉన్నవారు తొందరగానే తెలుసుకుంటున్నా చాలామంది మధుమేహం ముదిరే వరకు కనిపెట్టలేకపోతున్నారు. చివరకు మధుమేహం నియంత్రణ లేక శరీర అవయవాలన్నీ దెబ్బతింటున్నాయి. అందుకే డయాబెటిస్ (చక్కెర వ్యాధి) ఇప్పుడు పెద్ద ఆందోళనకరంగా మారింది. కాగా, మటన్ మహా ఇష్టంగా తినేవారికి మధుమేహం టైప్-2 వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందట.

పదేళ్ల పరిశీలనతో తేలిన నిజం..

కేంబ్రిడ్జి అంటే ప్రఖ్యాత యూనివర్సిటీ. వీరు పదేళ్ల పాటు మటన్‌ తినే అలవాటు ఉన్నవారిని పరిశీలించారు. వీరు వారంలో రెండు, మూడుసార్లు సూప్, ఫ్రై, కూర... ఇలా ఏదో ఒక రకంగా మటన్ తినేవారే. ఇలాంటివారిలో టైప్-2 డయాబెటిస్ ముప్పు మిగతావారికంటే 15 శాతం ఎక్కువగా అవకాశం ఉందని కేంబ్రిడ్జి పరిశోధకుల పరిశీలనలో తేలింది. దీనికి కారణం మటన్‌ లోని హానికారక శాచురేటెడ్‌ కొవ్వులు సహజ ఇన్సులిన్‌ విడుదలను అడ్డుకోవడమేనని తేల్చారు. ఇదే జరిగితే శరీరంలో ఇన్సులిన్ పెరిగిపోతుంటుంది. కాగా, ప్రాసెస్‌ చేసి, నిల్వ ఉంచిన ప్యాకేజ్డ్‌ మటన్‌ తో మరీ డేంజర్ అని తేల్చారు. ఇది తినేవారిలో మధుమేహ ముప్పు మరీ ఎక్కువని స్పష్టమైందట. మరి దీనికి విరుగుడు ఏమిటో కూడా వారే చెప్పారు.. మంచి కొవ్వులూ, ప్రొటీన్‌ కోసం చేపలు తినడం మేలని సూచించారు కేంబ్రిడ్జి పరిశోధకులు.

Tags:    

Similar News