ఆకులు కావవి .. ఆరోగ్య ప్రదాతలు
అధిక బరువుతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ ఉదయం కరివేపాకును నమలడం మూలంగా బరువు తగ్గుతారు.
కరివేపాకు, పుదీనా, కొత్తిమీర లేకుండా మన కిచెన్ లో వంటలు పూర్తి కావు. ఇక దక్షిణ భారత వంటకాల్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. మరి ప్రతిరోజూ ఉదయాన్నే పరిగడుపున నాలుగు కరివేపాకు ఆకులు తినడం మూలంగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా ?
అధిక బరువుతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ ఉదయం కరివేపాకును నమలడం మూలంగా బరువు తగ్గుతారు. దాంతో పాటు కొవ్వు కూడా తగ్గుతుంది.
ఖాళీ కడుపుతో కరివేపాకును నమలడం మూలంగా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఉదయం పూట ఏమీ తినకుండా తిన్నప్పుడు ఎంజైమ్‌లు ఉత్తేజితమై పేగులలో కదలికలను సులభతరం చేస్తాయి. దీనిమూలంగా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందుతారు.
ఉదయం నిద్ర లేచిన తర్వాత చాలా మందికి శరీర బలహీనత, తల తిరగడం, వాంతులు, వికారం వంటి సమస్యలుంటాయి. ఈ లక్షణాలతో బాధపడుతున్న వారు కరివేపాకు ఆకులను నమిలితే పై ఇబ్బందులు తొలగిపోతాయి.
కరివేపాకు నమలడం మూలంగా జుట్టు రాలడాన్ని నిరోధించవచ్చు. ఉదయం పూట ముందుగా ఒక గ్లాసు నీరు తాగాలి. కొన్ని నిమిషాల తర్వాత తాజా కరివేపాకులను నమిలి మింగాలి. అల్పాహారానికి 30 నిమిషాల ముందు ఇలా చేయడం మూలంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.