ఇక.. హార్లిక్స్ వంతు: హెల్త్ డ్రింక్ కాదు
తాజాగా కోట్లాది మందికి హెల్త్ డ్రింక్ గా సుపరిచితమైన హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదన్న విషయాన్ని తాజాగా సదరు కంపెనీ తేల్చేసింది.
దశాబ్దాల తరబడి నిజమని నమ్మిన విషయాలు నిజం కావని.. అసలు నిజం ఫలానా అన్న విషయం వెలుగు చూడటంపై విస్మయం వ్యక్తమవుతోంది. హెల్త్ డ్రింక్ గా పేరున్న బోర్నవీటా అదికాదన్న విషయం తేలిన వేళ.. తాజాగా కోట్లాది మందికి హెల్త్ డ్రింక్ గా సుపరిచితమైన హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదన్న విషయాన్ని తాజాగా సదరు కంపెనీ తేల్చేసింది. ఇప్పటివరకు సదరు కంపెనీ సైతం హార్లిక్స్ ను హెల్త్ డ్రింక్ గా పేర్కొనటం గమనార్హం.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ ల్లో డెయిరీ ఉత్పత్తులను లేబులింగ్ చేయకూడదని తేల్చింది. తృణధాన్యాలతో కూడిన పాల ఉత్పత్తులు.. ఆరెంజ్.. లైమ్ వంటి ఫ్లేవర్లతో ఉన్న హెల్త్ డ్రింక్స్ కేటగిరీలు వినియోగదారుల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంది.
అంతేకాదు.. ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దంటూ కేంద్రం తన మార్గదర్శకాలతో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని సంస్థలు తమ ఉత్పత్తుల లేబులింగ్ లో మార్పులు చేయటం షురూ చేశాయి. ఏదైనా సంస్థ తమ ఉత్పత్తులపై కామెంట్ చేయటం ద్వారా జరిగే డ్యామేజ్ కంటే ముందే తమను తాము మార్చుకోవాలన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగా హార్లిక్స్ తన లేబులింగ్ లో మార్పులు చేసింది.
వినియోగదారుల వస్తు ఉత్పత్తుల్లో దిగ్గజంగా పేరున్న హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్ యూఎల్)తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్ మీద కీలక మార్పులు చేసింది. గతంలో హెల్త్ ఫుడ్ డ్రింక్స్ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ ను ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్ కేటగిరిలోకి మార్పులు చేసింది. ఈ మార్పునకు కారణం.. కేంద్ర వాణిజ్య.. పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవల జారీ చేసిన ఆదేశాలతోనే తాజా మార్పులు చోటు చేసుకున్నాయి. హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి డ్రింక్స్.. పానీయాలను తొలగించాలని పేర్కొంది. మరింతకాలం జరిగిందేంటి? హెల్త్ డ్రింక్స్ అన్న పేరుతో కంపెనీలు అమ్మేసిన వైనం విస్మయానికి గురి చేస్తున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో ఇలాంటి లీలలెన్ని వెలుగు చూస్తాయో?