రోజుకొక్కసారైనా నవ్వాల్సిందే.. వైద్యుల మాట కాదు.. ఆ దేశంలో చట్టం
జపాన్ అంటే పని.. పని.. రెండో ప్రపంచ యుద్ధం ఆ దేశ ప్రజల ఐడియాలజీని మార్చేసిందని చెబుతారు.
నవ్వడం ఒక 'భోగం' నవ్వించడం ఒక 'యోగం' నవ్వలేకపోవడం ఒక 'రోగం'.. దశాబ్దాలుగా మనకు తెలిసిన సామెత ఇది.. కొంతమంది నవ్వు అనేది ఆభరణం. మరికొందరికి నవ్వే రాదు.. అయితే, నవ్వలేని వారంతా హాస్య ప్రియులు కారని చెప్పలేం.. లేదా లోపల లోపల నవ్వుతూ ఉండొచ్చు.. ఇదేకాదు.. నవ్వుతూ ఉండేవారి ఆరోగ్యం నాలుగు కాలల పాటు పదిలంగా ఉంటుందని అంటుంటారు. కాగా.. ఆనందమే జీవన మకరందం అని పెద్దలు ఎప్పుడో చెప్పారు కూడా.. మనిషి ఎన్ని కష్టాలు వచ్చినా చెరగని చిరునవ్వుతో ఉండాలని అంటుంటారు.
పనే కాదు జీవితం..
జపాన్ అంటే పని.. పని.. రెండో ప్రపంచ యుద్ధం ఆ దేశ ప్రజల ఐడియాలజీని మార్చేసిందని చెబుతారు. చరిత్రలో అణు బాంబు దాడికి గురైన దేశంగా జపాన్ తిరిగి కోలుకుంటుందనే ఆశలు ఎవరికీ లేవు. కానీ, వారు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అక్కడి ప్రజల క్రమశిక్షణ, ప్రభుత్వాల పట్టుదలతో జపాన్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత డెవలప్డ్ దేశంగా నిలిచిపోయింది. కాగా, జపాన్ లో చట్టాలు కూడా చాలా కట్టుదిట్టంగా ఉంటాయని చెబుతారు. అలాంటిచోట తాజాగా చేసిన ఓ చట్టం.. అందరినీ ఆలోచింపజేస్తోంది. దాని ఉద్దేశం.. ప్రతి రోజూ అందరూ నవ్వాలని చట్టం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మన దేశంలో జిల్లాలు, రాష్ట్రాలు ఉన్నట్లు జపాన్ లో ప్రిఫెక్చర్స్ ఉంటాయి. అలాంటిదే ‘యమగట’.
పేరు యమగట ఉన్నా..
ప్రిఫెక్చర్స్ పేరులో ‘యమ’గట అని ఉన్నా.. అక్కడి ప్రభుత్వం ప్రతి రోజూ అందరూ నవ్వాలంటూ చట్టం తెచ్చింది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడమే దీని ఉద్దేశంగా పేర్కొంది. ప్రజలను నవ్వమని చెప్పడమే కాదు.. సంస్థల్లో ఉద్యోగుల మధ్య నవ్వుతో కూడుకున్న వాతావరణాన్ని ప్రోత్సహించాలని ఆదేశించింది. ప్రతి నెల ఎనిమిదో తేదీని ప్రత్యేకంగా ‘హాస్యంతో ఆరోగ్యం’ కోసం కేటాయించాలని సూచించింది. కాగా, యమగటలో ‘ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్’ విశ్వ విద్యాలయం ఇటీవల మెరుగైన ఆరోగ్యం, జీవన కాల పెంపుపై కొన్ని పరిశోధనలు చేసింది. వాటి ఫలితమే తాజా చట్టం. తక్కువగా నవ్వే వాళ్లలో కొన్ని రకాల వ్యాధుల వల్ల మరణం ముప్పు పెరుగుతోందని గుర్తించారు. దీని ఆధారంగానే ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది.
నవ్వడంపైనా ఏడుపే?
యమగట ప్రభుత్వం నవ్వాలంటూ చట్టం చేయడాన్ని కొందరు రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం గమనార్హం. వ్యక్తిగత కారణాలతో కొందరు నవ్వలేరని, ఇలాంటివారిపై చట్టం ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. నవ్వడం, నవ్వకపోవడం అనేది భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగమని జపాన్ కమ్యూనిస్ట్ పార్టీ వివరిస్తోంది. అనవసర నిబంధనల ద్వారా ప్రజల హక్కులను కాలరాయొద్దని అంటోంది. కాగా.. నవ్వడంపై వస్తున్న విమర్శలను అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తిప్పికొడుతోంది. నవ్వడాన్ని ప్రజలపై రుద్దడం లేదని.. వారి ఇష్టానికే వదిలేస్తున్నట్లు తెలిపింది. అందుకే నవ్వని వారిపై జరిమానా విధింపు వంటి అంశాలను చేర్చలేదని వివరించింది.