ఉప్పు.. చక్కెరను వదలని ప్లాస్టిక్.. షాకిచ్చేలా తాజా రిపోర్టు
టాక్సిక్స్ లింక్ అధ్యయనంలో వెల్లడైన అంశాలు ఇప్పుడు వణికేలా చేస్తున్నాయి.
అది ఇది అన్న తేడా లేకుండా ఎటు చూసినా ప్లాస్టిక్ తోనే ప్రపంచం నిండిపోతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. తినే ఆహారంలో ప్లాస్టిక్ ధూళి కణాలు ఉన్నప్పటికి.. ఉప్పు.. పంచదార లాంటి వాటిల్లోనూ ఈ ప్లాస్టిక్ భూతం పాకేసిందన్న షాకింగ్ నిజం ఇప్పుడు కొత్త ఆందోళనకు కారణమవుతోంది. టాక్సిక్స్ లింక్ అధ్యయనంలో వెల్లడైన అంశాలు ఇప్పుడు వణికేలా చేస్తున్నాయి.
మన దేశంలో అమ్ముతున్న ఉప్పు.. చక్కెరలలో ప్రమాదకరమైన మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు తేలింది. ఏ బ్రాండ్ ఉప్పు.. పంచదార అయినప్పటికీ ఇందుకు మినహాయింపు కాదన్న విషయాన్ని చెబుతున్నారు. బ్రాండెడ్ ఉప్పు.. చక్కెర మాత్రమే కాదు.. ఆన్ బ్రాండెడ్ ఉప్పు.. పంచాదారలోనూ ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ట్యాక్సిక్స్ లింక్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్ అనే పేరుతో జరిపిన అధ్యయనంలో భాగంగా పది రకాల ఉప్పు.. 5 రకాల పంచదారను శాంపిల్ గా సేకరించారు.
ఈ సంస్థ అధ్యయనం కోసం తీసుకున్న టేబుల్.. రాక్.. సముద్ర.. స్థానిక ముడి ఉప్పును తీసుకొని పరిశీలించారు. పంచదార.. ఉప్పులోఉన్న మైక్రో ప్లాస్టిక్స్ సైజు 0.1 మిల్లీ మీటర్ల నుంచి 5 మిల్లీ మీటర్ల వరకు ఉన్నట్లుగా గుర్తించారు. అయోడైజ్డ్ ఉప్పులో అత్యధికస్థాయిలో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని తేల్చారు. ఒక అంచనా ప్రకారం భారతీయులు రోజు సగటున 10.98 గ్రాముల ఉప్పును.. పది చెంచాల పంచదారను తీసుకుంటారని గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో పోలిస్తే.. ఇది చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఇటీవల జరిపిన పరిశోధనలో ఊపిరితిత్తులు.. గుండెతో పాటు తల్లిపాలు.. గర్భస్థ శిశువుల్లోనూ మైక్రోప్లాస్టిక్స్ ఉన్న విషయాన్ని గుర్తించటం తెలిసిందే. ఒక కేజీ ఉప్పులో 6.91 నుంచి 89.15 వరకు మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లుగా గుర్తించారు. ఆర్గానిక్ రాక్ సాల్ట్ లో అతి తక్కువగా 6.7 మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. కేజీ పంచదారలో 11.85 నుంచి 68.25 మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లుగా గుర్తించారు. ఆర్గానిక్ పంచదారతో పోలిస్తే.. ఆర్గానికేతర చక్కెరలోనే ఇవి ఎక్కువగా ఉండటం గమనార్హం.