మన పక్క దేశానికీ వచ్చేసింది... మంకీ ఫాక్స్ ఎలా వ్యాపిస్తుందంటే..?
ఇందులో భాగంగా ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీ ఫాక్స్ వణికించేస్తుంది. ఈ క్రమంలో భారత్ పక్క దేశానికీ పాకింది.
కరోనా మిగిల్చిన విషాదాల నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పరిస్థితి. ఇప్పటికీ అక్కడక్కడా ఆ మహమ్మారి మిగిల్చిన గాయాల తాలూకు మచ్చలు అలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచానికి మరో కొత్త టెన్షన్ మొదలైంది. ఇందులో భాగంగా ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీ ఫాక్స్ వణికించేస్తుంది. ఈ క్రమంలో భారత్ పక్క దేశానికీ పాకింది.
అవును... ఇప్పుడు మంకీఫాక్స్ అనే మహమ్మారి ప్రపంచానికి సరికొత్త సమస్యగా మారుతుంది. ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీఫాక్స్ ఇప్పుడు భారత్ పొరుగుదేశమైన పాకిస్థాన్ కు చేరింది. మరోవైపు దీని విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) అంతర్జాతీయ ఎక్స్ ట్రీం స్టేటస్ ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇది ఎలా వ్యాపిస్తుంది.. దీని లక్షణాలు ఏమిటి అనేది చూద్దాం...!
మంకీఫాక్స్ ఎలా వ్యాప్తి చెందుతుంది?:
మంకీఫాక్స్ అనేది నేరుగా తాకడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. నోరు, ఇతర అవయువాల నుంచి వచ్చే స్రవాల వల్ల కూడా సోకే అవకాశం ఉందని అంటున్నారు. ఇక రోగులు వాడిన దుస్తులు, ఇతర వస్తువులు వినియోగించినా సొకే అవకాశం ఉందని చెబుతున్నారు. వీటిలో ఒక వేరియెంట్ ప్రధానంగా లైంగిక సంబంధాల కారణంగా వేగంగా వ్యాపిస్తుందని చెబుతున్నారు!
మంకీఫాక్స్ లక్షణాలు ఏమిటి?:
ఈ వైరస్ మనిషి శరీరంలోకి పైన చెప్పుకున్న రీతుల్లో ప్రవేశించిన తర్వాత ఒక రోజు నుంచి మూడు వారాల్లో ఎప్పుడైన ఈ లక్షణాలు బయటపడొచ్చు. జ్వరం, గొంతు ఎండిపోవడం, పొక్కులు రావడం, జాయింట్ పెయిన్స్, వెన్ను నొప్పి వంటివి ఉంటాయి. ఇవి కనీసం 2 నుంచి 4 వారాలపాటు కొనసాగవచ్చు. అయితే ఇది సదరు రోగి రోగనిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది.
వ్యాక్సిన్స్ ఉన్నాయా?:
ఏదైనా వైరస్ పేరు వినిపించగానే ముందుగా వచ్చే ఆలోచనల్లో వ్యాక్సిన్ ఏమైనా ఉందా అని! ఇదే సమయంలో మంకీఫాక్స్ తెరపైకి వచ్చాక ఇదే ప్రశ్న హల్ చల్ చేస్తుంది. అయితే... ప్రస్తుతం ఈ వైరస్ నివారణకు రెండు రకాల టీకాలు వినియోగంలో ఉన్నాయి. వీటిని వారం క్రితమే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ ఎమర్జెన్సీ వింగ్ లిస్టింగ్ చేసింది.
అయితే ఈ టీకాలను చాలా దేశాల్లో ఆయా ఆరోగ్య విభాగాలు ఇంకా అనుమతులు జారీ చేయకపోవడంవల్ల కొంత సమస్యాత్మకం కానుందని తెలుస్తోంది. అయితే తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ణయంతో ఈ ప్రక్రియలు వేగవంతం కానున్నాయి!
మరణాల రేటు ఎలా ఉంది?:
ఇక ఈ వైరస్ సోకినవారికి ప్రాణహాని ఏ మేరకు ఉందనే విషయం కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. వాస్తవానికి మంకీఫాక్స్ లో రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటిని క్లాడ్-1, క్లాడ్-2 గా విభజించారు. క్లాడ్-1 అంటే.. కాంగోబేసిన్ క్లాడ్ కాగా.. క్లాడ్-2 అంటే పశ్చిమ ఆఫ్రికా క్లాడ్. వీటిల్లో క్లాడ్-1 తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుండగా.. క్లాడ్-2 కొంత తక్కువ ప్రమాదకరం అని చెబుతున్నారు.
క్లాడ్-1 సోకినవారిలో మరణాల రేటు 1 నుంచి 10 శాతం వరకూ ఉండగా.. క్లాడ్-2 మరణాల రేటు 1 శాతం కంటే తక్కువ! అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మరణాల రేటు ఎక్కువగా ఉన్న క్లాడ్-1 ఐబీ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది. దీంతోనే ప్రపంచ దేశాల్లో కొత్త ఆందోళన నెలకొంది. ప్రధానంగా లైంగిక సంబంధాల కారణంగా ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది.
ప్రస్తుతం నాలుగు దేశాల్లో ఈ క్లాడ్-1 లోని వేరియంట్లు సోకిన 100 కేసులను గుర్తించగా... వాటిలో బురుండి, కెన్యా, ఉగాండా, రువాండా దేశాలు ఉన్నాయి. ఇక ఇప్పటివరకూ మొత్తం మంకీ ఫాక్స్ కేసుల సంఖ్య 15,600 గా ఉండగా.. మరణాల సంఖ్య 537గా ఉంది. కాగా... భారత్ లో 2022లో మంకీఫాక్స్ కేసులు నమోదవ్వగా.. 27 మందికి ఇది సోకినట్లు ల్యాబ్స్ లో నిర్ధారించారు.