కాఫీ.. కూల్ డ్రింక్స్ తో పక్షపాత ముప్పు.. ఎంతంటే?

శాస్త్రవేత్తలు చెప్పేదేమంటే.. ఇవన్నీ తాగే బదులు మంచినీళ్లు తాగితే మంచిదని చెబుతున్నారు. దాని వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పటం గమనరా్హం

Update: 2024-10-02 07:30 GMT

కూల్ డ్రింక్స్ అంటే ఇష్టమా? కాఫీ లేకుండా రోజు గడవదా? రెడీమేడ్ ఫ్రూట్ జ్యూస్ అంటే తెగ ఇంట్రస్టు చూపిస్తారా? అయితే.. దీన్ని మిస్ కాకుండా చదవాల్సిందే. ఎందుకంటే.. ఈ అలవాట్లు ఉన్న వారికి పక్షపాతం ముప్పు ఎక్కువన్న విషయాన్ని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మరి.. ఇవేం తాగకుండా ఇంకేం తాగాలి? అన్న సందేహం రావొచ్చు. శాస్త్రవేత్తలు చెప్పేదేమంటే.. ఇవన్నీ తాగే బదులు మంచినీళ్లు తాగితే మంచిదని చెబుతున్నారు. దాని వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పటం గమనరా్హం.

రోజుకు నాలుగు కప్పుల కన్నా ఎక్కువగా కాఫీ తాగటం ఏ మాత్రం మంచిది కాదని.. దాని వల్ల లాభం కాదు కదా అనర్థాలు ఎక్కువగా ఉంటాయని గుర్తించినట్లుగా తేల్చారు. మెదడులోని ఏదైనా భాగానికి రక్తసరఫరా నిలిచిపోయి.. ఆ అవయువంలోని కణాలు దెబ్బ తిన్న పరిస్థితుల్లో పక్షపాతం రావొచ్చని చెబుతున్నారు. మెదడులోని రక్తనాళాల్లో అవరోధాల కారణంగా ఇస్కీమిక్ పక్షపాతం.. రక్తస్రావం వల్ల హెమరేజిక్ పక్షపాతం అనే రెండు రకాలు ఉంటాయని పేర్కొంటున్నారు.

దాదాపు 27 దేశాల్లోని 27 వేల మందిని ‘ఇంటర్ స్ట్రోక్’ ప్రాజెక్టు కింద అంతర్జాతీయ పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరిలో 13,500 మంది మొదటిసారి పక్షపాతం బారిన పడినోళ్లు. వీరి నుంచి సేకరించిన పలు వివరాలను చూసినప్పుడు శీతలపానీయాలు..రెడీమేడ్ ఫ్రూట్ జ్యూస్ ల వినియోగం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించారు. తూర్పు.. మధ్య ఐరాపో..పశ్చిమాసియా.. దక్షిణ అమెరికావాసుల్లో శీతల పానీయాల వినియోగానికి.. పక్షపాతానికి మధ్య సంబంధం ఉన్న విషయం వెల్లడైనట్లు పేర్కొన్నారు.

మార్కెట్లో లభించే ఎక్కువ రెడీమేడ్ ఫ్రూట్ జ్యూస్ లలో కాన్ సెంట్రేట్ల నుంచి తయారు చేసినవే. వీటిలో అదనపు చక్కెరలు.. ఎక్కువకాలం నిల్వ ఉండేందుకు వీలుగా రసాయనాల్ని వాడుతున్నారు. తాజా పండ్ల రసాలతో వచ్చే ప్రయోజనాల్ని ఇవి దెబ్బ తీస్తున్నాయి. మెదడులో రక్తస్రావం వల్ల వచ్చే పక్షపాతం ముప్పును రెడీమేడ్ ఫ్యూట్ జ్యూస్ లు 37 శాతం పెంచుతాయని.. ఇలాంటివి రోజుకు 2 చొప్పున తాగితే ముప్పు మూడింతలుగా తేల్చారు.

అంతేకాదు.. రోజుకు నాలుగు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే వారిలో పక్ష్పాత ముప్పు 37 శాతం పెరుగుతుందని తేల్చారు. టీ తాగటం వల్ల ఈ ప్రమాదం 18-20 శాతం తగ్గే వీలుంది. బ్లాక్ టీ తీసుకోవటం వల్ల పక్షపాతం ముప్పు 29 శాతం తగ్గే వీలుందని తేల్చారు. చివరగా.. మరో మాట. రోజుకు 7 కప్పుల కంటే ఎక్కువ నీరు తాగితే మెదడులో రక్తం గడ్డ కట్టటం వల్ల వచ్చే పక్షపాతం ముప్పు తగ్గుతుందన్న అంశాన్ని అధ్యయనంలో గుర్తించారు. సో.. ఏం తాగాలి? ఏం తాగకూడదు? ఎంత తాగాలి? ఎంతకు మించి తాగొద్దన్న విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది కదా?

Tags:    

Similar News