మీ వయసుకు తగ్గట్టు మీరు నిద్రపోవడం లేదా.. అయితే ఇది మీరు కచ్చితంగా తెలుసుకోవాలి..
నిద్ర.. మన ఆరోగ్యానికి, మానసిక ఉత్తేజానికి ఎంతో ముఖ్యమైన విషయం. అయితే ఇది చాలామంది ఏదో రొటీన్ గా తీసుకుంటారు
నిద్ర.. మన ఆరోగ్యానికి, మానసిక ఉత్తేజానికి ఎంతో ముఖ్యమైన విషయం. అయితే ఇది చాలామంది ఏదో రొటీన్ గా తీసుకుంటారు. కానీ మనం మన వయసుకు తగినట్టు నిద్రపోవాలి అన్న విషయం మీకు తెలుసా? నిజమండి.. మనం మన వయసుకు తగినట్టు.. నిద్ర పోకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు తప్పంటున్నారు నిపుణులు. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం పదండి..
మనం శారీరకంగా, మానసికంగా హెల్తీగా ఉండాలి అంటే ప్రతిరోజు తృప్తిగా నిద్రపోవాలి. ప్రస్తుతం ఉన్న హడావిడి జీవనశైలి, ఒత్తిడి కారణంగా కొంతమంది రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ ని ఒక వ్యాపకంగా మార్చుకుంటున్నారు. అలా ఫోన్ చూస్తూ నిద్రపోతాం అంటారే తప్ప.. ఫోన్ చూస్తున్నంత సేపు నిద్ర రాదు అన్న విషయాన్ని మర్చిపోతారు. ఏ అర్ధరాత్రి పడుకొని పొద్దున హడావిడిగా లేచి ఆఫీస్ కి రెడీ అయి బయలుదేరుతారు. ఇలా చేయడం వల్ల నిద్రపోయే సమయం తగ్గిపోయి శరీరంపై దుష్ప్రభావం పడుతుంది అని వైద్యులు సూచిస్తున్నారు
తాజా అధ్యయనాల ప్రకారం పెద్దలు కనీసం రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు నిద్రపోవాలి. చాలా తక్కువ సేపు నిద్రపోయేవారికి త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయట. అంతేకాదు మానసిక ఒత్తిడి పెరగడంతో పాటు వీరికి తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. సుమారు సగం పైన ఆరోగ్య సమస్యలు సరిగ్గా నిద్రపోకపోవడం వల్లే తలెత్తుతాయి. కాబట్టి మనం తీసుకునే నిద్ర మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో ముఖ్యం.
ఎవరు ఎన్ని గంటలు నిద్రపోవాలి?
అధ్యయనాల ప్రకారం వయసును పట్టి మనం నిద్రించాల్సిన సమయాన్ని అంచనా వేశారు..
మూడు నెలల లోపు పిల్లలు 14 నుంచి 17 గంటల వరకు నిద్రించాలి. నాలుగు నెలల నుంచి సంవత్సరంలోపు బిడ్డలు 12 నుంచి 16 గంటల వరకు నిద్రించాలి. మూడు సంవత్సరాల లోపు చిన్నారులు రోజుకు కనీసం 11 నుంచి 14 గంటల నిద్రపోవాలి. ఐదు సంవత్సరాల లోపు బిడ్డలు 10 నుంచి 13 గంటలు నిద్రించాలి. కాస్త ఎదిగే కొద్ది పిల్లల నిద్రించే సమయం తగ్గుతూ వస్తుంది. 12 సంవత్సరాల లోపు పిల్లలు రోజుకి కనీసం 9 నుంచి 11 గంటలు పడుకోవాలి. టీనేజర్స్ రోజుకి 9 నుంచి 10 గంటలు నిద్రించాలి.
మధ్య వయస్సు వారు కచ్చితంగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. 60 సంవత్సరాలు దాటిన వారు కనీసం ఏడు గంటల పాటు నిద్రించాలి. ఈ టైం ని మనం కచ్చితంగా ఫాలో అవ్వాలి లేకపోతే ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రశాంతమైన నిద్రను అలవాటు చేసుకోవడం మర్చిపోకండి. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పట్టడానికి కాస్త యోగ, వాకింగ్ లాంటివి చేయడం మర్చిపోకండి.