వల్లభనేని వంశీ అనుచరులు 11 మంది అరెస్ట్.. కేసు ఏమిటంటే..?
అవును... గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన దారుణాలు, దాడులు, మొదలైన వ్యవహారాలపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్న సంగతి తెలిసిందే! అప్పట్లో నిర్లక్ష్యానికి గురైన వ్యవహారాలపై తాజాగా పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో తాజాగా వల్లభనేని వంశీ అనుచరులుగా చెప్పబడుతున్న 11 మందిని అరెస్ట్ చేశారు.
అవును... గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందిస్తులుగా ఉన్న 11 మందిని శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. వీరిలో వల్లభనేని వంశీ పీఏ రాజా కూడా ఉన్నారు.
ఇదే సమయంలో... ఈ ఘటనకు సంబంధించి విజయవాడ రూరల్, బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరుకు చెందిన మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. ఈ కేసులో ఇప్పటివరకూ 71 మందిపై పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయగా.. వారిలో ఏ17గా వల్లభనేని వంశీ ఉన్నారు!
కాగా... గత ప్రభుత్వ హయాంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వల్లభనేని వంశీ అనుచరులు సీరియస్ గా స్పందించి.. మూకుమ్మడిగా టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది.
అయితే.. దీనిపై అప్పట్లో కేసులు నమోదైనప్పటికీ దర్యాప్తు ముందుకు పడలేదు! ఈ నేపథ్యంలో... తాజాగా కూటమి ప్రభుత్వం కొలువుదీరిని అనంతరం పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు! దీంతో.. వరుస అరెస్టులు జరుగుతున్నాయి!!