ఆంధ్రా టు అమెరికా.. 2024 చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికోలాహలం

తమ భవిష్యత్ ను తాము నిర్ణయించుకోనున్నారు. తెలుగు సంప్రదాయాల్లో ప్రతి ఏడాదికీ ఓ పేరున్నట్లు ఈ 2024కు కూడా ఓ పేరు పెట్టాలేమో..?

Update: 2024-05-07 11:54 GMT

ప్రపంచానికి ఈ మూలన తైవాన్ నుంచి.. ఆ మూలన ఉన్న అమెరికా వరకు.. పైనున్న బ్రిటన్ నుంచి కింద ఉన్న భారత్ దాక.. ప్రపంచంలో ఈ ఏడాది ఒకటే సందడి.. వేర్వేరు జాతులు.. వేర్వేరు సమయాలు.. వేర్వేరు జీవన రీతులు.. కానీ, కొన్ని వందల కోట్ల మంది మాత్రం ఒక్కటే కారణంతో ముందుకు కదలనున్నారు. తమ భవిష్యత్ ను తాము నిర్ణయించుకోనున్నారు. తెలుగు సంప్రదాయాల్లో ప్రతి ఏడాదికీ ఓ పేరున్నట్లు ఈ 2024కు కూడా ఓ పేరు పెట్టాలేమో..?

ఏచోట చూసినా ఎన్నికోలాహలం..

2024 వస్తూ వస్తూనే పాకిస్థాన్ లో ఎన్నికలు తెచ్చింది. ఆ తర్వాత తైవాన్.. ఇప్పుడు భారత దేశంలో పోలింగ్ జరుగుతోంది. ఇక్కడే కాదు.. ప్రపంచం నలుమూలలా ఈ ఏడాది వరకు ఎన్నికల కోలాహలం కొనసాగనుంది. అందుకనే మానవ చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల సంవత్సరంగా 2024ను పేర్కొంటున్నారు. భారత్, అమెరికా వంటి చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో దేశాధినేతలను ఎన్నుకునే ఎన్నికలు జరగనుండగా.. చాలాచోట్ల ఈ ఏడాది ప్రాంతీయ ఎన్నికలున్నాయి.

టాప్ 10 జనాభా దేశాల్లో ఏడు చోట్ల చైనా, భారత్, అమెరికా తదితర అత్యధిక జనాభా ఉన్న పది దేశాల్లో 2024లో ఏడుచోట్ల ప్రజలు ఓటు వేయనున్నారు. ఇక భూగోళం మొత్తం 64 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 4 బిలియన్లు.. అంటే 400 కోట్ల మందిపై ప్రభావం ఉండనుంది. కాగా, పాక్, తైవాన్, బంగ్లాదేశ్ వంటిచోట్ల ఇప్పటికే ఫలితాలు కూడా వెలువడ్డాయి. మన దేశంలో ఏడు విడతల్లో పోలింగ్‌ జరుగుతోంది. 96.8 కోట్ల మంది ఓటు వేయనున్నారు. 2019 ఎన్నికలకు ఇప్పటికి వీరి సంఖ్య 15 కోట్ల వరకు పెరిగింది.

ఓటెత్తిన ఇండోనేసియా ప్రపంచంలో అతిపెద్ద ముస్లిం దేశమైన, విస్తీర్ణం పరంగానూ పెద్ద దేశమైన ఇండోనేసియాలోనూ ఈ ఏడాది ఎన్నికలు జరిగాయి. ప్రపంచంలోనే అత్యధిక మంది ఒకేరోజు ఓటు హక్కు వినియోగించుకొన్నది ఇక్కడే కావడం విశేషం. 20 కోట్ల మంది ఓటర్లలో 82.39 శాతం ఓటేశారు. పసిఫిక్ మహా సముద్రంలోని అతి చిన్న దేశమైన టువాలు లోనూ ఎన్నికలు జరిగాయి. అతి తక్కువగా 10 వేల మంది లోపే ఇక్కడ ఓటు వేశారు. విశేషం ఏమంటే.. నియంత కిమ్‌ పాలనలోని ఉత్తర కొరియాలో పార్లమెంటరీ ఎన్నికలు ఏప్రిల్‌ 10న జరుగుతాయని ప్రకటించినా ఆ వివరాలు బయటకు రాలేదు. దీని పక్కనే ఉండే దాయాది దేశం దక్షిణ కొరియాలో ఏప్రిల్‌ 10న జాతీయ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

బంగ్లాదేశ్‌ లో అవామీ లీగ్ అధినేత షేక్‌ హసీనా రికార్డు స్థాయిలో నాలుగోసారి ప్రధాని అయ్యారు. భూటాన్‌ లో త్సెరింగ్‌ టోబ్గేను ప్రజలు ప్రధానిగా ఎన్నుకొన్నారు.

చైనాకు తైవాన్ చెక్ వన్ చైనా నినాదంతో ఊగిపోయే చైనాకు ఈ ఏడాది తైవాన్ జలక్ ఇచ్చింది. అక్కడ చైనా వ్యతిరేక పార్టీ డీపీపీకి చెందిన విలియం లాయ్‌ చింగ్‌ గెలుపొందారు. పాక్ లో ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పార్టీ (పీఎంఎల్‌ఎన్‌), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కూటమి గెలుపొందింది.

భారత్ వ్యతిరేకి గెలుపు ఏప్రిల్‌ లో మాల్దీవుల పీపుల్స్ మజ్లిస్‌ (పార్లమెంట్‌)కు జరిగిన ఎన్నికల్లో పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ గెలుపొందింది. భారత వ్యతిరేకి అయిన అధ్యక్షుడు ముయిజ్జు పార్టీకి మెజారిటీ లభించింది.లంకలో ఏం జరగనుందో? ఆర్థికంగా దివాలా తీసిన శ్రీలంకలో నవంబరులో పార్లమెంట్‌, అధ్యక్ష ఎన్నికలున్నాయి.

అటు అమెరికా ఇటు రష్యా మార్చి 15-17 మధ్య రష్యాలో ఎన్నికలు జరగ్గా పుతిన్‌ మళ్లీ గెలిచారు. అమెరికాలో నవంబర్‌ 5న ఎన్నికలు జరగనున్నాయి. పాత ప్రత్యర్థులు బైడెన్‌-ట్రంప్‌ మరోసారి తలపడనున్నారు. ఐరోపా సమాఖ్య పార్లమెంట్‌ కు జూన్‌ 6-9 మధ్య ఎన్నికలున్నాయి.

మనోడు మళ్లీ గెలుస్తాడా? బ్రిటన్ దాదాపు రెండేళ్ల కిందట భారత సంతతి రిషి సునాక్ ప్రధాని అయ్యారు. ఇప్పుడు ఆయన సారథ్యంలోని కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికలను ఎదుర్కోనుంది. ఈసారి ప్రత్యర్థి లేబర్‌ పార్టీకి చాన్స్ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. మరి మనోడు రిషి సునాక్ నెగ్గుతారా? లేదా? చూడాలి.

Tags:    

Similar News