బాలీవుడ్ మూవీ లెవల్ లో 2500 ఏళ్ల నాటి బంగారు కిరీటం చోరీ
యూరోపియన్ దేశాల్లో ఒకటైన నెదర్లాండ్స్ లో అత్యంత విలువైన వస్తువును చోరీ చేసేందుకు భారీ ఎత్తున ప్లాన్ చేశారు.
రీల్ కనిపించే సీన్ రియాల్ లో ఆవిష్క్రతమైంది. అత్యంత విలువైన ఒక ఆభరణం కోసం బాలీవుడ్ యాక్షన్ మూవీ తరహాలో చోరీ చేసిన వైనం అందరిని విస్మయానికి గురి చేసేలా చేసింది. వందల ఏళ్ల నాటి బంగారు కిరీటం కోసం చేసిన ప్రయత్నాలు.. సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఇంతకు అంత విలువైనది ఏమిటి? దాని విశేషాలు ఏమిటి? అన్న అంశంలోకి వెళితే..
యూరోపియన్ దేశాల్లో ఒకటైన నెదర్లాండ్స్ లో అత్యంత విలువైన వస్తువును చోరీ చేసేందుకు భారీ ఎత్తున ప్లాన్ చేశారు. 2500 ఏళ్ల నాటి బంగారు కిరీటాన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. అయితే..దీన్ని చోరీ చేసేందుకు సినిమా స్టైల్ లో ప్లాన్ చేశారు. నెదర్లాండ్స్ లోని ఎస్సెన్ నగరంలోని డ్రెంట్స్ పురాతన వస్తు ప్రదర్శనశాలలో ఈ చోరీ జరిగింది.
తెల్లవారుజాము వేళలో ముసుగులు ధరించిన దొంగలు మ్యూజియం వద్దకు వచ్చారు. బయట ఉన్న భారీ తలుపునకు రంధ్రాలు పెట్టే మెషీన్.. ఇనుప రాడ్ల సాయంతో దాన్ని తెరిచారు. లోపల మరో భారీ తలుపు ఉంది. అత్యంత పటిష్ఠంగా ఉండే ఈ తలుపును తెరవటం సాధ్యం కాదు. అందుకే.. తమతో తెచ్చుకున్న పెద్ద బాంబును తలుపునకు అమర్చి పేల్చేశారు. బాంబు ధాటికి భారీ తలుపు తునాతునకలు అయ్యాక.. లోపలకు వెళ్లిన వారు అక్కడున్న అత్యంత ప్రాచీనమైన నాలుగు వస్తువుల్ని తమతో తీసుకెళ్లిపోయారు.
ఈ నాలుగు ఆభరణాల్లో అత్యంత విలువైనది 2500 ఏళ్ల నాటి కిరీటం. చూసినంతనే ఇప్పటి హెల్మెట్ ను గుర్తుకు తెచ్చేలా దీని డిజైన్ ఉంటుంది. క్రీస్తు పూర్వం 50వ సంవత్సరంలో దీన్ని తయారు చేసినట్లుగా చరిత్రకారులు చెబుతుంటారు. దాదాపు 907 గ్రాముల బరువు ఉంటుంది. ఈ హెల్మెట్ లాంటి కిరీటం వంద ఏళ్ల క్రితం రొమేనియాలోని ఒక కుగ్రామంలో గుర్తించారు. అప్పట్లో దీన్ని ఉత్సవాలు.. సంబరాల వేళ వినియోగించే వారని చెబుతారు.. హెల్మెట్ ముందు బాగంలో చెక్కిన పెధ్ద కళ్లకు ప్రత్యేకత ఉంటుందని చెబుతారు. దుష్ట శక్తుల ప్రభావం సోకకుండా ఉండేందుకు వీటిని చెక్కి ఉంటారని చెబుతారు.
రొమేనియా సంస్క్రతికి చిహ్నంగా భావించే ఈ కళాఖండం చోరీకి గురి కావటంపై ఆ దేశం ఆవేదన వ్యక్తం చేసింది. దీన్ని వెల కట్టలేని వస్తువుగా పేర్కొంది. ఈ చోరీలో భాగంగా డేసియన్ల రాజ్యానికి చెందిప నాటి రాయల్ బ్రేస్ లెట్ తో పాటు.. మూడు వస్తువుల్ని చోరీ చేశారు. రోమన్లు రొమేనియాను పాలించటానికి ముందు.. రాజ్యమేలిన డేసియన్ల కల్చర్ ను కళ్లకు కట్టేలా ఉంచేందుకు ఈ ప్రదర్శనకు ఉంచారు. అవన్నీ ఇప్పుడు దొంగల బారిన పడ్డాయి.
ఈ అరుదైన కళాఖండాల్ని తిరిగి అప్పజెప్పే ఒప్పందం మీద నేషనల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ రొమేనియా నుంచి తీసుకొచ్చిన ప్రాచీన వస్తువులు చోరీకి గురి కావటం నెదర్లాండ్స్ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దీని లెక్క తేల్చేందుకు ఆగమేఘాల మీద అధికారుల్ని నియమించారు. ఇందులో భాగంగా మ్యూజియంకు దగ్గర్లో ఒక కారు కాలిపోయిన వైనం చూసినప్పుడు దీనికి దొంగతనానికి లింకు ఉంటుందని భావిస్తున్నారు. 170 ఏళ్ల తమ మ్యూజియం చరిత్రలో ఇంతటి చోరీని చూడలేదని మ్యూజియం డైరెక్టర్ వాపోతున్నారు. ఇప్పుడీ ఉదంతం ఆ రెండు దేశాల్లో సంచలనంగా మారింది.