అదుర్సు: 300వంటలతో అనకాపల్లి అల్లుడికి అతిథ్యం

సంక్రాంతి పండక్కి ఇంటికి వచ్చిన కొత్తల్లుడికి ఏకంగా 300 రకాల వంటలతో మర్చిపోలేని అతిథ్యాన్ని అందించిన వైనం హాట్ టాపిక్ గా మారింది. అందరిని చూపు వారింటివైపు పడేలా చేసింది.

Update: 2024-01-17 04:21 GMT

మర్యాదలకు గోదారోళ్లకు సాటి వచ్చేటోళ్లే లేరంటారు. అయితే.. ఈ విషయంలో తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన ఒక కుటుంబం అడుగు ముందుకేసింది. అనకాపల్లి అన్నంతనే తియ్యటి బెల్లం గుర్తుకు వస్తుంది. అదిరే అతిథ్యంలోనూ తమకు మించినోళ్లు ఉండరన్నట్లుగా చేతల్లో చేసి చూపించిందో కుటుంబం. సంక్రాంతి పండక్కి ఇంటికి వచ్చిన కొత్తల్లుడికి ఏకంగా 300 రకాల వంటలతో మర్చిపోలేని అతిథ్యాన్ని అందించిన వైనం హాట్ టాపిక్ గా మారింది. అందరిని చూపు వారింటివైపు పడేలా చేసింది.

అనకాపల్లికి చెందిన గుండా సాయిగోపాల్, మాధవి దంపతులకు ఒక కుమార్తె ఉన్నారు. ఆమె పేరు రిషిత. అనకాపల్లిలో బియ్యం వ్యాపారిగా పేరున్న సాయిగోపాల్.. తన కుమార్తెను విశాఖపట్నానికి చెందిన దేవేంద్రనాథ్ కు ఇచ్చి డిసెంబరు 15న పెళ్లి చేశారు. సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుడ్ని విందుకు ఇంటికి పిలిచారు. ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి సంక్రాంతి సందర్భంగా భారీ విందును ఇచ్చి స్వీట్ షాకిచ్చారు.

300 వంటలతో ఏర్పాటు చేసిన ఈ భారీ విందు.. అనకాపల్లి పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది. అందరూ ఆసక్తిగా చర్చించుకున్నారు. సాధారణంగా ఇలాంటి మర్యాదలకు గోదావరి జిల్లాలే కేరాఫ్ అడ్రస్ గా చెబుతుంటారు. అందుకు భిన్నంగా ఈసారి అనకాపల్లి వాసి సిద్ధం చేసిన ఈ భారీ విందులో.. పులిహోర.. దద్దోజనం మొదలుకొని రకరకాల బిర్యానీలు.. పిండి వంటలు.. భారీ ఎత్తున స్వీట్లు.. శీతల పానీయాలు.. ఇలా ఇది.. అది అన్న తేడా లేకుండా ఏర్పాటు చేసిన ఈ భారీ మెనూ అదిరిపోయినట్లుగా చెప్పాలి. తమ కుటుంబ సభ్యులంతా కలిసి మూడు రోజుల పాటు ఈ వంటల్ని చేసినట్లుగా వారు చెబుతున్నారు.

Tags:    

Similar News