ఆరేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడి దురాగతం
శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ దురాఘతం ఆదివారం వెలుగులోకి వచ్చింది.
అనకాపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో ఐదేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ దురాఘతం ఆదివారం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బాలిక అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటోంది. శనివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా, అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు ఆట పేరుతో తన ఇంట్లోకి తీసుకువెళ్లాడు. ఆ సమయంలో బాలుడి తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడంతో బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
బాలిక ఇంటికి వెళ్లి జరిగిన సంఘటనను తల్లికి చెప్పింది. గ్రామపెద్దలు బాలుడి తల్లిదండ్రులను పిలిపించి మందలించడంతోపాటు పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలిసిన వెంటనే ఎలమంచిలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ ఆదివారం గ్రామానికి వెళ్లి బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడారు. బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విశాఖ కేజీహెచ్ కు తరలించారు. నాలుగు నెలల క్రితం అనకాపల్లి జిల్లాలోనే బాలికపై హత్యాచారం జరిగింది. ఈ సంఘటనను ఎవరూ మరచిపోకముందే మరో దురాగతం చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. బాలికలు, మహిళలపై అత్యాచారాలు నిరోధానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఈ సంఘటన మరోమారు గుర్తు చేసింది.