ఒక బ్యాగ్.. దేశ రాజకీయాలనే ఊపేస్తుంది!
దక్షిణ కొరియా మొదటి మహిళ ఆ బ్యాగ్ గిఫ్ట్ గా స్వీకరించటమే దీనికి ప్రధాన కారణం అని ఆరోపణలు వస్తున్నాయి.
అగ్గి పుల్ల, సబ్బు బిల్ల, కుక్క పిల్ల కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా... ఒక విషయం రాజకీయ రంగు పులుముకోవడానికీ... రాజకీయాల్లో ఒక అంశం చిచ్చుపెట్టడానికి కూడా ఏదీ అనర్హం కాదు! ఒక్కో సారి చిన్న విషయం కూడా పెద్ద సమస్యను తెచ్చిపెడుతుంది.. మరికొన్ని సార్లు అతిపెద్ద సమస్య కూడా చప్పుడు లేకుండా ముగిసిపోతుంటుంది.. రాజకీయాల్లో మాత్రమే అది సాధ్యమవుతుంటుంది! ఇదే క్రమంలో తాజాగా ఒక బ్యాగ్ దేశ రాజకీయాల్లోనే చిచ్చుపెట్టింది.
అవును... ఓ ఖరీదైన బ్యాగ్ ఏకంగా దేశ రాజకీయాల్లో చిచ్చుపెట్టింది. ఇందులో భాగంగా దక్షిణ కొరియాలో ఇప్పుడు ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. దక్షిణ కొరియా మొదటి మహిళ ఆ బ్యాగ్ గిఫ్ట్ గా స్వీకరించటమే దీనికి ప్రధాన కారణం అని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబందించినదిగా చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
వివరాళ్లోకి వెళ్తే... దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ భార్య కిమ్ కియోన్ హీ... రెవ్ అబ్రహం చోయ్ అనే పాస్టర్ నుంచి ఓ ఖరీదైన డియోర్ బ్యాగ్ ను కానుకగా స్వీకరించారు అనేది ఆరోపణ. దీనికి సంబందించినదిగా చెబుతున్న వీడియో కూడా తాజాగా వైరల్ గా మారింది. ఇప్పుడు దక్షణి కొరియా రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. కారణం... అక్కడున్న చట్టాలే!!
వాస్తవానికి దక్షిణ కొరియాలోని చట్టాల ప్రకారం మిలియన్ వాన్ (భారత కరెన్సీలో 62,160 రూపాయలు) కంటే విలువైన వస్తువులను కానుకలు, బహుమతులగా స్వీకరించకూడదు! ఒకవేళ అంతకు మించి విలువైన వాటిని తీసుకుంటే దాన్ని అక్కడి చట్టాలు లంచంగా పరిగణిస్తాయి. ఇక్కడగ గమనించాల్సిన విషయం ఏమిటంటే... దక్షిణా కొరియాలో లంచం వ్యతిరేక చట్టం చాలా కఠినంగా అమల్లో ఉంది.
ఈ క్రమంలో దేశ మొదటి మహిళ సుమారు మూడు మిలియన్ వాన్స్( భరాత కరెన్సీలో సుమారు 1,86,811 రూపాయలు) విలువైన డియోర్ బ్యాగ్ ను పాస్టర్ అబ్రహం చోయ్ నుంచి ఆమె స్వీకరించారనే అంశం ఇప్పుడు అక్కడ రాజకీయంగా పెను దుమారమే రేపుతోంది. ఎంతలా అంటే... ఈ ఏడాదిలో జరగబోయే ఎన్నికలను ప్రభావితం చేసేంతలా.
ఈ ఏడాది ఏప్రిల్ లో దక్షిణ కొరియాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో కిమ్ కియోన్ హీ బ్యాగ్ వ్యవహారం అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు సరికొత్త తల నొప్పిగా మారిందని అంటున్నారు. అయితే... ఈ వ్యవహారానికి సంబంధించినది అని చెబుతున్న వీడియోలో ఆమె ఆ బ్యాగ్ ను తీసుకున్నట్లు కనిపించటం లేదని స్థానిక మీడియా చెబుతుంది!
వినిపిస్తున్న ఆరోపణలు, సమర్ధింపుల సంగతి కాసేపు పక్కనపెడితే... ఆ బ్యాగ్ ఇటీవల అధ్యక్ష కార్యాలయంలో గుర్తించబడిందట. దీంతో అధ్యక్షుడి భార్య చట్టవ్యతిరేకంగా బ్యాగ్ రూపంలో లంచం తీసుకుందని ఆరోపిస్తూ.. ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే సమయంలో... ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని పట్టుబడుతున్నాయి.
దీంతో... మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా... ఇప్పటికే మైనార్టీ ప్రభుత్వంగా కొనసాగుతున్న అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పై ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ బ్యాగ్ ఆరోపణలు ఏమిటో అంటూ ఫీలవుతున్నారంట ఆయన అభిమానులు. దీంతో... ఏప్రిల్ 10న జరగబోయే అధ్యక్ష ఎన్నికలపై ఈ బ్యాగ్ బహుమతి ప్రభావం ఏ మేరకు ఉందబోతుందనేది వేచి చూడాలి!