పెద్దమనసు... సౌదీ జైలు నుంచి విడిపించేందుకు రూ.34 కోట్ల సమీకరణ!
వివరాళ్లోకి వెళ్తే... కేరళలోని కోజికోడ్ కు చెందిన అబ్దుల్ రహీం అనే వ్యక్తి సౌదీలో ప్రత్యేక అవసరాల సౌదీ బాలుడికి కేర్ టేకర్ గా ఉండేవాడు.
మనిషికి మనిషే సాయం చేయాలని ఒకరంటే... దేవుడు నేరుగా రాడు, మరో మనిషి రూపంలోనే సాయం అందిస్తాడు.. అందుకే సాయం చేసిన మనిషిలోనే దేవుడిని చూసుకోవాలి అని అంటుంటారు! ఎలా చెప్పినా.. ఎటు చెప్పినా.. ఒక మనిషికి మరో మనిషే సాయం చేయాలి.. అప్పుడు వారికి ప్రకృతి సాయం చేస్తుంది!! ఈ క్రమంలో తాజాగా కేరళీయులు అలాంటి మంచి మనసునే చాటుకున్నారు. వారి పెద్ద మనసు ఇప్పుడు వైరల్ గా మారుతోంది!
అవును... సౌదీ అరేబియాలో మరణశిక్ష ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులు ఏకం అయ్యారు. అంతా ఒక తాటిపైకి వచ్చారు. ఇందులో భాగంగా ఏకంగా రూ.34 కోట్లు సమీకరించి పెద్దమనసు చాటుకున్నారు. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ స్థాయిలో వారి మనసు, ఐకమత్యం ఉన్నాయా అంటూ ఆసక్తికరమైన చర్చకు దారితీసింది!
వివరాళ్లోకి వెళ్తే... కేరళలోని కోజికోడ్ కు చెందిన అబ్దుల్ రహీం అనే వ్యక్తి సౌదీలో ప్రత్యేక అవసరాల సౌదీ బాలుడికి కేర్ టేకర్ గా ఉండేవాడు. ఈ క్రమంలో 2006లో పొరపాటున ఆ బాలుడు చనిపోవడానికి కారణమయ్యాడట. దీంతో అప్పటి నుంచి జైల్లోనే మగ్గుతున్నాడు రహీం. మరోవైపు.. బాలుడి కుటుంబం క్షమాభిక్షకు అంగీకరించకపోవడంతో 2018లో రహీంకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది.
ఈ సమయంలో నిందితుడి తరఫు అభ్యర్థనలనూ న్యాయస్థానం ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా తిరస్కరించిందని అంటున్నారు. అయితే... కొన్నాళ్లకు.. "బ్లడ్ మనీ" చెల్లిస్తే క్షమించేందుకు బాధిత కుటుంబం అంగీకరించింది! ఈ క్రమంలోనే ఈ నెల 18వ తేదీలోగా సుమారు రూ.34 కోట్లు చెల్లించినట్లైతే అతడికి మరణశిక్ష తప్పే అవకాశముంది. దీంతో ఒక టీం అందుకు సిద్ధమైంది.
రహీం కోసం 34 కోట్ల రూపాయల నిధులు సమీకరించి విడిపించేందుకు ఓ కార్యాచరణ బృందం నిధుల సమీకరణ మొదలు పెట్టింది. ఈ సమయంలో వ్యవహారం ట్రాన్స్ పరెంట్ గా ఉండటం కోసం ప్రత్యేకంగా ఒక యాప్ ను సైతం రూపొందించింది. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం వరకు కూడా.. కొద్ది మొత్తమే పోగైనప్పటికీ... ఆ తర్వాత కేరళీయులు పెద్దఎత్తున స్పందించి విరాళాలు అందించారు. దీంతో... 34 కోట్లూ పోగైందని తెలుస్తోంది!