ఇదో సిత్రమైన పంచాయితీ.. జీన్స్ వేసుకోమన్న అత్త.. చీర కడతానన్న కోడలు

విషయం మరింత ముదిరి చివరకు పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఈ వైనం విస్మయానికి గురి చేస్తోంది.

Update: 2023-11-21 11:30 GMT

అచ్చు తప్పులేం లేవు. మీరు చదివింది అక్షరాల నిజమే. రోటీన్ కు భిన్నమైన ఉదంతంగా దీన్ని చెప్పుకోవాలి. మిగిలిన అత్తగార్లకు భిన్నంగా తాజా ఎపిసోడ్ లో అత్తగారు తన కోడల్ని కాస్తంత మెడ్రన్ గా ఉండేందుకు.. జీన్స్ ధరించాలని కోరటం.. అందుకు కోడలు మాత్రం నో అంటే నో అనేయటం ఒక ఎత్తు అయితే.. విషయం మరింత ముదిరి చివరకు పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఈ వైనం విస్మయానికి గురి చేస్తోంది.

సాధారణంగా అత్తలు ఎప్పుడు సంప్రదాయబద్ధంగా కోడల్ని చీరలు కట్టుకోవాలని కోరటం.. అందుకు కోడలు నో చెప్పటం కనిపిస్తుంటుంది. కానీ.. తాజా ఉదంతంలో మాత్రం అత్త మోడ్రన్ గా ఉండమంటే.. కోడలు మాత్రం తాను సంప్రదాయపద్దతిలో చీరలు కట్టుకుంటానని చెప్పటం వివాదంగా మారింది. ఉత్తరప్రదేశ్ లోని అగ్రాలో చోటు చేసుకున్న ఈ వివాదం అంతకంతకూ ముదిరి చివరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది.

హరిపర్వత్ కు చెందిన ఒక యువకుడికి ఎత్మాద్ పుర్ కు చెందిన ఒక యువతితో ఏడాది క్రితం పెళ్లైంది. తన మాదిరే తన కోడల్ని జీన్స్ దుస్తులు ధరించాలని అత్త కోరుతోంది. అయితే.. తాను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చానని.. తాను ఆ పని చేయలేనని పేర్కొంది. దీనికి అత్త మాత్రం.. తన మాదిరే జీన్స్ వేసుకోవాలన్న ఒత్తిడి తేవటంతో విషయాన్ని భర్త ముందుకు తీసుకెళ్లిందట. అతను కూడా తన తల్లి చెప్పినట్లేగా మోడ్రన్ దుస్తులు ధరించాలన్న మాట చెప్పటంతో హతాశులైన ఆ కోడలు పోలీసుల్ని ఆశ్రయించింది.

తనకు జీన్స్ వేసుకోవటం ఇష్టం లేదని.. ఆ విషయాన్ని భర్తకు చెబితే అతను తననే కొడుతున్నాడని.. తనకు న్యాయం చేయాలంటూ పోలీసుల్ని ఆశ్రయించింది. ఈ రేర్ కేసును సున్నితంగా డీల్ చేయాలని భావించిన పోలీసులు.. అత్తా కోడళ్ల మధ్య రాజీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా వీరిద్దరికి కౌన్సెలింగ్ఇస్తున్నట్లు చెబుతున్నారు. మరి.. ఈ ఎపిసోడ్ లో చివరకు ఎవరు ఎవరి దారికి వస్తారన్నది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

Tags:    

Similar News