నిన్నటి వరకు అల్లు అర్జున్.. నేడు కేటీఆర్.. తెలంగాణలో సంచలన పరిణామాలు
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా సంచలన విషయాలు నమోదవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా సంచలన విషయాలు నమోదవుతున్నాయి. అల్లర్లు.. అరెస్టులు అన్నట్లుగా జరుగుతున్నాయి రాష్ట్రంలో పరిణామాలు. ఎప్పుడు ఎవరికి నోటీసులు అందుతాయో.. పోలీసులు ఎవరిని విచారణకు రమ్మంటారో తెలియకుండా ఉంది. నిన్నా మొన్నటిదాక హాట్‌హాట్‌గా నడిచిన అల్లు అర్జున్ వ్యవహారం కాస్త సమసిపోగానే...ఇప్పుడు కేటీఆర్ టాపిక్ తెరమీదకు వచ్చింది.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం.. ఆమె కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడం.. ఈ ఘటన జరగడానికి అల్లు అర్జునే కారణమంటూ కేసు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏకంగా బన్నీని అరెస్ట్ చేసి ఒక రాత్రంతా జైలులో పెట్టేశారు. వారం రోజులపాటు ఈ ఎపిసోడ్ రాష్ట్రవ్యాప్తంగానూ ఉత్కంఠకు దారితీసింది. అంతేకాకుండా నిన్న మరోసారి పోలీసులు అల్లు అర్జున్‌ను విచారణకు పిలిచారు. ఘటనకు సంబంధించిన వివరాలన్నింటినీ సేకరించారు. పలు ప్రశ్నలతో బన్నీ నుంచి సమాధానాలు రాబట్టారు. నిన్నటి విచారణతో అల్లు అర్జున్ వివాదం ప్రభావం కాస్త తగ్గినట్లుగా తెలుస్తోంది.
తాజాగా.. కేటీఆర్ కేసు తెరమీదకు వచ్చింది. ఫార్ములా- ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటికే మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ మీద కేసులు నమోదు చేసింది ఏసీబీ. ఈ మేరకు ఈ కేసును మరింత స్పీడప్ చేసింది. ప్రభుత్వం తరఫున మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. సుమారు 7 గంటల పాటు ఆయనను సుదీర్ఘంగా విచారించారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ అయినట్లు దాని కిషోర్ వెల్లడించారు. కాగా.. ఈ స్టేట్‌మెంట్ ఆధారంగానే కేటీఆర్‌తో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. వీరిని ఒకటి రెండు రోజుల్లోనే విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్ నగరంలో ఈ ఫార్ములా కార్ రేస్ నిర్వహించారు. అయితే.. దీనికి సంబంధించి కేబినెట్, ఆర్థిఖ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే రూ.45 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించి ప్రజాధనం దుర్వినియోగం చేశారని కేటీఆర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆర్బీఐ రూల్స్ ఫాలో కాకుండా మౌఖిక ఆదేశాలతోనే నగదు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ.10కోట్ల కంటే ఎక్కువ చెల్లించాలంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ హెచ్ఎండీఏ ఫాలో కాలేదు. దీంతో చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. దీంతో కేటీఆర్, అరవింద్‌తోపాటు బీఎల్ఎన్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి.
అయితే.. ఈ కేసులో కేటీఆర్‌కు ఇప్పటికే హైకోర్టులో ఊరట లభించింది. పది రోజులపాటు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దన్న ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణకు సహకరించాలని కేటీఆర్‌ను ఆదేశించింది. తనపై పెట్టిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను మాత్రం తిరస్కరించింది. కాగా.. ఇదే కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఏసీబీ కేసు ఆధారంగానే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. నేడు దాన కిషోర్ పూర్తి కావడంతో.. ముందుముందు కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అరవింద్‌ను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారికి నోటీసులు అందించి విచారించడంతోపాటు అరెస్టు చేస్తారన్న ప్రచారాలూ జరుగుతున్నాయి.