బిగ్ బ్రేకింగ్... 'కెప్టెన్' విజయ్ కాంత్ కన్నుమూత!
డీఎండీకే అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ కాంత్ ఇటీవల అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే
డీఎండీకే అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ కాంత్ ఇటీవల అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. స్థానిక మియాట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంతరం ఇటీవలే డిశ్చార్జీ అయిన ఆయన.. మళ్లీ అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు మరోసారి మియాట్ ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో చికిత్స తీసుకుంటూ విజయ్ కాంత్ తుదిశ్వాస విడిచారు! దీంతో... ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
అవును... సీనియర్ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ (79) కన్నుమూశారు. తాజాగా ఆయనకు ఇన్ఫెక్షన్ సోకిందని.. టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని చెబుతున్నారు. ఫలితంగా... శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో ఆయనకు వెంటిలేటర్ చికిత్స అందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ కాంత్ అనంతలోకాలకు వెళ్లినట్లు సమాచారం అందింది. దీంతో... ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు దుఃఖ సాగరంలో మునిగిపోయారని తెలుస్తుంది.
1979లో వచ్చిన ‘ఇనిక్కుమ్ ఇలమై’సినిమాతో అరంగేట్రం చేసిన విజయ్ కాంత్... 150 కు పైగా సినిమాల్లో నటించారు. వాటిలో 20కిపైగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. అనంతరం... 2005 సెప్టెంబర్ 14న డీఎండీకే పార్టీని స్థాపించారు. ఈ క్రమంలో 2006లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2011లో ప్రతిపక్ష నేతగానూ పనిచేశారు. ఆయన నటించిన ఆఖరి సినిమా "సగప్తం" (2015).
కాగా... డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్య కారణాలతో కొన్నేళ్లుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ సమయంలో ఆయన సతీమణి పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు. గతంలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న విజయ్ కాంత్... అప్పటినుంచి రెగ్యులర్ గా ఆసుపత్రికి వెళ్లి వైధ్యపరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ సమయంలో కరోనా కూడా సోకడంతో తుది శ్వాస విడిచారు!