ప్రముఖ హీరోయిన్ తో ఐఆర్‌ఎస్ అధికారి చెట్టా పట్టాలు.. గిప్టులు, భారీగా నగలు!
ప్రముఖ మలయాళీ నటి నవ్య నాయర్ వ్యవహారం ఆ రాష్ట్రంతోపాటు దేశమంతా హాట్ టాపిక్ గా మారింది.
ప్రముఖ మలయాళీ నటి నవ్య నాయర్ వ్యవహారం ఆ రాష్ట్రంతోపాటు దేశమంతా హాట్ టాపిక్ గా మారింది. నవ్య నాయర్ తో ఒక ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్‌ఎస్) అధికారి అత్యంత సన్నిహిత సంబంధాలు నెరిపారనే వ్యవహారం కలకలం రేపుతోంది. మనీలాండరింగ్ వ్యవహారంలో నవ్య నాయర్ ను ఎన్‌ఫోర్సుమెంట్ డైరక్టరేట్ (ఈడీ) తాజాగా ముంబైలో ప్రశ్నించింది. ఈ విచారణలో ఆమె కీలక అంశాలను వెల్లడించినట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
కాగా మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే ఐఆర్‌ఎస్ అధికారి సచిన్ సావంత్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అతడికి ప్రముఖ నటి నవ్య నాయర్ తో సన్నిహిత స్నేహం ఉందని ఈడీ గుర్తించింది. ఇందుకు సంబంధించి ఇద్దరి మధ్య నడిచిన వాట్సాప్ సంభాషణల ఆధారంగా నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ కేసులో నవ్య నాయర్ ను ఈడీ ముంబయికి రావాలని ఆదేశించింది. దీంతో నవ్య నాయర్ ముంబయి చేరుకున్నారు. ఆమెను ప్రశ్నించిన ఈడీ పలు కీలక విషయాలను నమోదు చేసింది.
కాగా సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఐఆర్‌ఎస్ అధికారి సచిన్ సావంత్ మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆధారాలు లభించాయి. ఈ కేసు దర్యాప్తు సందర్భంగా అతడి మొబైల్ డేటాను అధికారులు క్షుణ్ణం గా పరిశీలించారు. ఇందులో భాగంగా ఆయన వాట్సాప్ సంభాషణలను పరిశీలించారు. ఇందులో అతడు హీరోయిన్ నవ్య నాయర్ తో చాట్ సాగించినట్టు వెల్లడైంది. దీంతో వీరిద్దరి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు గుర్తించింది. ఐఆర్‌ఎస్ అధికారి సచిన్ సావంత్, నవ్య నాయర్ చాలా సన్నిహితంగా మెలిగినట్లు ఈడీ అధికారులు నిర్ధారించారు.
ఈ క్రమంలో హీరోయిన్ నవ్య నాయర్‌ని కలిసేందుకు సచిన్ సావంత్ సుమారు 10 సార్లు పైగానే కేరళలోని కొచ్చిన్ కు కూడా వెళ్లినట్లు ఈడీ గుర్తించింది. ఈ విషయంపై ఈడీ నవ్య నాయర్ ను ప్రశ్నించగా తనకు సచిన్ సావంత్ తో ఎలాంటి సంబంధం లేదని ఆమె వెల్లడించినట్టు సమాచారం. తామిద్దరం కేవలం స్నేహితులమేనని ఆమె చెప్పినట్టు తెలుస్తోంది.
అయితే నవ్య నాయర్ చెప్పినదానికి విరుద్ధంగా ఆమెకు సచిన్ సావంత్ నగలతోపాటు కొన్ని విలువైన బహుమతులు కూడా ఇచ్చాడని పక్కా ఆధారాలతో విచారణలో స్పష్టమైంది. అయితే తాను స్నేహితురాలినే కావడంతోనే సచిన్ తనకు ఈ గిప్టులు ఇచ్చాడని నవ్య నాయర్ ఈడీకి బదులిచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె వాంగ్మూలాన్ని ప్రత్యేక కోర్టుకు సమర్పించిన చార్జిషీట్ లో ఈడీ జత చేసింది.
సీబీఐ అరెస్టు చేసిన సచిన్ సావంత్ గతంలో ముంబైలోని జోనల్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం కస్టమ్స్, జీఎస్‌టీ అదనపు కమిషనర్ గా ఆయన పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆధారాలు లభించడంతో సీబీఐ అతన్ని అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చేర్చింది. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.
ఈ విచారణలో సచిన్ సావంత్ కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు తేలింది. తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్లతో పెద్ద పెద్ద భవనాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ కేసు విచారణలో భాగంగానే మలయాళ నటి నవ్య నాయర్ పేరు తెరపైకి వచ్చింది. ఆమెకు సైతం భారీ ఎత్తున నగలు, గిఫ్టులు ఇచ్చినట్టు వెల్లడైంది.