అదానీ పెట్టుబ‌డులు.. కూట‌మికి భారీ దెబ్బ‌.. !

ముఖ్యంగా జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన సౌర విద్యుత్ ఒప్పందాల‌పై అప్ప‌ట్లో చంద్ర‌బాబు బాగానే విమ‌ర్శ‌లు గుప్పించారు.

Update: 2024-11-23 16:30 GMT

దేశంలో ప్ర‌ముఖ వ్యాపారవేత్త‌, ప్ర‌పంచ కుబేరుల్లో తొలి ఐదు స్థానాల్లో ఉన్న గౌతం అదానీ వ్య‌వ‌హారం అమెరికాలోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ర‌చ్చ రేపుతోంది. ఆయ‌న ప‌లువురు అధికారులు, రాజ‌కీయ నేత‌ల‌కు లంచాలు ఇవ్వ‌చూపార‌నే విష‌యం వెలుగులోకి వ‌చ్చాక‌.. పార‌ద‌ర్శ‌కత కోరుకునే ఏపీ వంటి కూట‌మి స‌ర్కార్ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆది నుంచి కూడా అదానీ వ్య‌వ‌హారంపై అనుమానాలు వ్య‌క్తం చేశారు.

ముఖ్యంగా జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన సౌర విద్యుత్ ఒప్పందాల‌పై అప్ప‌ట్లో చంద్ర‌బాబు బాగానే విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. స‌ర్కారు మారి, కూట‌మి వ‌చ్చిన త‌ర్వాత‌.. అదే అదానీ వ్య‌వ‌హారంలో సునిశితంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. అమ‌రావ‌తి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అదానీ పెట్టుబ‌డులు పెట్టేందుకు మ‌రోసారి ముందుకు వ‌చ్చారు. దీనికి సంబంధించి ఆయ‌న ప్ర‌తినిధులు కూడా చంద్ర‌బాబును క‌లిశారు. దాదాపు 70 వేల కోట్ల వ‌ర‌కు పెట్టుబ‌డులు కొత్తా పెట్టేందుకు ప్ర‌తిపాదించారు.

ఈ పెట్టుబ‌డుల వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబు కూట‌మి స‌ర్కారు స‌మాలోచ‌న‌లు ప్రారంభించింది. అన్నీ క‌లిసి వ‌స్తే.. వ‌చ్చే నెల డిసెంబ‌రులో అదానీకి తిరిగి.. గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వాల‌ని కూడా నిర్ణ‌యించారు. నిజానికి జ‌గ‌న్ చేసుకున్న ఒప్పందాల‌పై విమ‌ర్శ‌లు చేసిన చంద్ర‌బాబు.. అదే అదానీ కంపెనీతో ఒప్పందాల‌కు సిద్ధం కావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచినా.. అప్ప‌ట్లో చేసిన రాజ‌కీయాలు ఇప్పుడు చేసేది లేద‌ని.. అందుకే అదానీతో పార‌ద‌ర్శ‌కంగా ఒప్పందాలు చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

కానీ, ఇంత‌లోనే .. అదానీపై విమ‌ర్శ‌లు, లంచాల ఆరోప‌ణ‌లు రావ‌డంతో చంద్ర‌బాబు స‌ర్కారు ఇప్ప‌డు డోలాయ‌మానంలో ప‌డిపోయింది. అయితే.. ఈ ఒప్పందాలు చేసుకోలేదు కాబ‌ట్టి చంద్ర‌బాబు ఈ విష‌యంలో తృటిలో బ‌య‌ట ప‌డ్డార‌నే చెప్పాలి. ఎందుకంటే.. కొన్ని ప్రాజెక్టుల విష‌యంలో నెల రోజుల కింద‌ట అదానీ గ్రూపు సంస్థ‌ల‌తో కూట‌మి ప్ర‌భుత్వం చ‌ర్చించింది. అవి అప్ప‌ట్లోనే ప‌ట్టాలు ఎక్కి ఉంటే.. ఇప్పుడు చంద్ర‌బాబు కూడా విమ‌ర్శ‌లు ఎదుర్కొనాల్సి వ‌చ్చేది. అయితే.. ఈ ప్ర‌భావం ఏపీపై ఎక్కువ‌గానే ప‌డ‌నుంది. అదానీని కాదంటే.. 70 వేల నుంచి భ‌విష్య‌త్తులో ల‌క్ష కోట్ల వ‌ర‌కు కోల్పోవ‌డం ఖాయం. అయినా.. ఇప్ప‌డున్న ప‌రిస్థితిలో త‌ప్పేలా లేదు.

Tags:    

Similar News