పార్ల‌మెంటు వాయిదాల స్టంటు: అదానీ దుమారం

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీపై న‌మోదైన కేసుల వ్య‌వ‌హారంపై చ‌ర్చ‌కు ప‌ట్టుబడుతూ.. ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన స‌భ్యులు లోక్‌స‌భలో నోటీసులు ఇచ్చాయి.

Update: 2024-11-27 08:20 GMT

పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ వాయిదాల స్టంటు న‌డుస్తోంది. ప్ర‌తిప‌క్ష స‌భ్యులు అదానీ వ్య‌వ‌హారంపై చ‌ర్చకు ప‌ట్టుబ‌ట్ట‌డం.. ఆ వెంట‌నే రెప్పపాటు కాలం కూడా వెయిట్ చేయ‌కుండానే స‌భ‌ల‌ను వాయిదా వేసేయ‌డం కామ‌న్‌గా మారిపోయింది. గ‌తంలోనూ ఇలానే జ‌రిగిన విష‌యం తెలిసిందే. తాజాగా బుధ‌వారం అటు లోక్‌స‌భ‌లోనూ, ఇటు రాజ్య‌స‌భ‌లోనూ వాయిదాలే న‌డిచాయి. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీపై న‌మోదైన కేసుల వ్య‌వ‌హారంపై చ‌ర్చ‌కు ప‌ట్టుబడుతూ.. ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన స‌భ్యులు లోక్‌స‌భలో నోటీసులు ఇచ్చాయి.

స‌భ ప్రారంభం అవుతూనే అదానీపై చ‌ర్చ కోరుతూ స్పీక‌ర్ ఓం బిర్లాకు విప‌క్ష స‌భ్యులు నోటీసులు ఇచ్చారు. అయితే, ఈ నోటీసుల‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్టు స్పీక‌ర్ ప్ర‌క‌టించ‌డంతో పాటు ప్ర‌శ్నోత్త‌రాల‌ను చేప‌ట్టారు. దీంతో విప‌క్ష స‌భ్యులు త‌మ త‌మ స్థానాల్లో లేచి నిల‌బ‌డి బిగ్గ‌ర‌గా నినాదాలు చేస్తూ స‌భ‌లో గంద‌ర‌గోళం సృష్టించారు. అయిన‌ప్ప‌టికీ స‌భ‌ను స‌జావుగా న‌డిపించేందుకు స్పీక‌ర్ ఓం బిర్లా ప్ర‌య‌త్నించినా.. స‌భ్యులు శాంతించ‌లేదు. ఈ నేప‌థ్యంలో స్పీక‌ర్ ఓం బిర్లా స‌భ‌ను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.

అయితే.. తిరిగి 12 గంట‌ల‌కు స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత కూడా ప్ర‌తిప‌క్ష స‌భ్యులు శాంతించ‌క‌పోవ‌డంతో స‌భ‌ను స్పీక‌ర్ ఓం బిర్లా రేప‌టికి వాయిదా వేశారు. ఇక‌, రాజ్య‌స‌భ‌లోనూ వాయిదాల ప‌ర్వమే న‌డిచింది. తొలుత ఈ రోజు ఉద‌యం స‌భ ప్రారంభం కాగానే చైర్మ‌న్ జ‌గ్‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ మాట్లాడుతూ.. 75వ రాజ్యాంగ దినోత్స‌వాన్ని మంగ‌ళ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించుకున్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఈ నేప‌థ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న స‌భ్యులు పెద్ద‌ల స‌భ‌కు మ‌రింత గౌర‌వాన్ని, మ‌ర్యాద‌ను ఇనుమ‌డింప జేయాల‌ని కోరారు.

స‌భా సంప్ర‌దాయాల‌ను పాటించాల‌ని చైర్మ‌న్‌ సూచించారు. చైర్మ‌న్ స్థానంలో కూర్చున్న వారు స‌భ‌ను స‌జావుగా న‌డిపించాల‌న్న భావ‌న‌తో ఉన్నార‌న్న విష‌యాన్ని గుర్తించాల‌ని పేర్కొన్నారు. వివాదాల‌కు, ఆందోళ‌న‌లకు స‌మ‌యం కాద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఎలాంటి నోటీసుల‌ను అనుమ‌తించ‌డం లేద‌ని చెప్పారు. నిర్మాణాత్మ‌క విధానంలో చ‌ర్చ‌లు చేప‌ట్టాల‌ని, నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించారు. అయితే, తాము ఇచ్చిన నోటీసుల‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని కోరుతూ విప‌క్ష స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు.

దీంతో చైర్మ‌న్ ధ‌న్‌ఖ‌డ్ స‌భ‌ను తొలుత ఈ రోజు ఉద‌యం 11 గంట‌ల 30 నిమిషాల వ‌ర‌కు వాయిదా వేశారు. తిరిగి 11 గంట‌ల 30 నిమిషాలకు స‌భ‌ ప్రారంభ‌మైన త‌ర్వాత కూడా ప‌లువురు స‌భ్యులు చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్ట‌డంతో పాటు త‌మ త‌మ స్థానాల్లో నిల‌బ‌డి ఆందోళ‌న చేశారు. దీంతో చైర్మ‌న్ స‌భ‌ను రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు వాయిదా వేస్తున్నట్టు ప్ర‌కటించారు. మొత్తంగా.. పార్ల‌మెంటు స‌మావేశాల‌కు ముందు ఏదో ఒక స‌మ‌స్య తెర‌మీదికి రావ‌డం.. దానిపైనే చ‌ర్చించాల‌ని ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుబ‌ట్ట‌డంతో స‌భ‌లు ఒక స్టంటుగా మారిపోయాయ‌న్న వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News