అవును.. అదానీ గ్రూప్ తప్పు చేసింది.. ఇప్పుడేం జరగనుంది?
అదానీ గ్రూప్ పై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలు.. స్టాక్ మార్కెట్ మీద ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలిసిందే
అదానీ గ్రూప్ పై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలు.. స్టాక్ మార్కెట్ మీద ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలిసిందే. ఈ సందర్భంగా అదానీ గ్రూప్ తప్పులపై సెబీ నిర్వహిస్తున్న దర్యాప్తు ఆఖరి దశకు వచ్చేసింది. ఇందులో భాగంగా మొత్తం 24 అంశాలకు 22 అంశాల్లో దర్యాప్తు పూర్తి చేసినట్లుగా సెబీ తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసులు సుప్రీంలో ఉన్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదైన సంస్థ పాటించాల్సిన నిబంధనలు.. విదేశీ పెట్టుబడుల పరిమితలకు సంబంధించి.. అదానీ గ్రూప్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా గుర్తించారు.
అయితే.. ఈ తప్పులన్నీ సాంకేతికమైనవని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదానీ గ్రూప్ పై ఎలాంటి చర్యలు ఉంటాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ గ్రూప్ పై దర్యాప్తు చేస్తున్న సెబీ.. ఆ వివరాల్ని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత మాత్రమే బయటపెట్టే అవకాశం ఉందంటున్నారు. సెబీ దర్యాప్తులో తప్పులు జరిగినట్లుగా గుర్తించినట్లుగా సమాచారం బయటకు వచ్చిన నేపథ్యంలో కొన్ని మీడియా సంస్థలు ఆదానీ గ్రూప్ స్పందన కోసం ప్రయత్నించగా.. ఎలాంటి బదులు రాలేదంటున్నారు. ఇదే అంశంపై సెబీని సంప్రదించగా.. వారి నుంచి కూడా మౌనమే సమాధానంగా చెబుతున్నారు. ఆదానీ గ్రూప్ తప్పులు చేసినట్లుగా సెబీ గుర్తించినట్లుగా వచ్చిన వార్తలపై తాము రెండు సంస్థల్ని సంప్రదించగా, ఎలాంటి బదులు రాలేదన్న విషయాన్ని ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.
సెబీ జరిపిన దర్యాప్తులో గుర్తించిన ప్రధాన అంశాల్లో ముఖ్యమైనది.. రిలేటెడ్ - పార్టీ లావాదేవీల వివరాల్ని అదానీ గ్రూప్ వెల్లడించకపోవటంగా చెబుతున్నారు. 13 రిలేటెడ్ పార్టీ లావాదేశీల్ని పరిశీలించినట్లుగా కోర్టుకు ఇచ్చిన సమాచారంలో సెబీ తెలిపినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెబీ చర్యలు ఏ రీతిలో ఉంటాయన్న దానికి సమాధానం వెతికితే.. దాదాపుగా జరిమానాతో సరిపెట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ఆదానీ గ్రూప్ లో ఉల్లంఘనలకు పాల్పడిన ఒక్కో సంస్థకు గరిష్ఠంగా రూ.కోటి వరకు ఫైన్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయ చట్టాల ప్రకారం ఒక భారతీయ కంపెనీలు విదేశీ పోర్టుఫోలియో మదుపరి మార్గంలో విదేశీ పెట్టుబడిదారు గరిష్ఠంగా 10 శాతం వరకు పెట్టుబడి పెట్టే వీలుంది. అయితే.. ఆదానీ సంస్థల్లో మాత్రం అందుకు భిన్నంగా విదేశీ పెట్టుబడిదార్లు పరిమితికి మించి పెట్టుబడులు పెట్టినట్లుగా చెబుతున్నారు. అధికారికంగా ఈ సమాచారం బయటకు రానప్పటికీ.. ఇండస్ట్రీ వర్గాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సెబీకున్న అధికారాల్ని చూస్తే ఫైన్ నుంచి నిషేధం వరకు ఎలాంటి నిర్ణయాన్ని అయినా తీసుకోవచ్చు. ఆదానీ ఎపిసోడ్ లో మాత్రం.. ఫైన్ వరకు పరిమితం అవుతారని చెబుతున్నారు. అందులో నిజం ఎంతన్నది కాలమే సరైన సమాధానం ఇవ్వగలదు.