బీజేపీకి టచ్‌లోకి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఆది నారాయణ రియాక్షన్ ఇదే!
వీరిలో కీలక నాయకులు కొందరు బీజేపీకి టచ్‌లో ఉన్నారని.. అవకాశం వస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేసేందుకు రెడీ అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి.
ఏపీలో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత వైసీపీ విషయంలో అనేక వార్తలు వస్తున్నాయి. ఈ పార్టీకి జగన్ మినహా 10 మంది ఎమ్మెల్యేలు విజయం దక్కించుకున్నారు. అలానే నలుగురు ఎంపీలు కూడా గెలిచారు. వీరిలో కీలక నాయకులు కొందరు బీజేపీకి టచ్‌లో ఉన్నారని.. అవకాశం వస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేసేందుకు రెడీ అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. వీరిలో ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలు ఉన్నారని తెలుస్తోంది.
రాజకీయంగానే కాకుండా..వ్యాపార పరంగా కూడా.. మిథున్ రెడ్డికి కేంద్రంతో అవసరాలు ఉన్నాయి. వీరి కుటుంబం విదేశాల్లోనూ వ్యాపారాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, మాజీ మంత్రి జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో అవినాష్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈయన ఈ కేసులో ఏ-8గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుల నుంచి కొంత మేరకు రక్షణ పొందేందుకు ఆయన కూడా.. బీజేపీతో చేతులు కలిపే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇక, నియోజకవర్గం అభివృద్ధి పేరుతో బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ వంటివారు కూడా.. బీజేపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వారిని బీజేపీ తీసుకుంటుందా? లేదా? అనే చర్చ జోరుగానే సాగుతోంది. దీనిపై తాజాగా బీజేపీ సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి, రాజంపేట ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పందించారు. తాజాగా ఆయన అమరావతి రాజధాని పనులను పరిశీలించేందుకు వచ్చారు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఓటమికి కారణాలు చెప్పుకొచ్చారు.
అమరావతి ని కాదన్న పాపం ఊరికేనే పోలేదని.. అందుకే వైసీపీ చిత్తుగా ఓడిపోయిందని చెప్పారు. ఇక, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీలోకి వచ్చేందుకు ప్రయత్నించినా.. ఆ ప్రయత్నాలు సాగబోవని చెప్పారు. వారిని చేర్చుకునే ప్రసక్తి లేదన్నారు. అయితే.. దీనిపై పార్టీ అగ్రనాయకత్వం తీసుకునే నిర్ణయం కోసం వేచి చూడాలని బదులిచ్చారు. రాష్ట్రంలో జగన్ పాలన , ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగా నాయకులు బలయ్యారని వ్యాఖ్యానించారు.