కడప ఎంపీ సీటుకు ఉప ఎన్నిక.. సంచలనంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే.. అసెంబ్లీ లాబీల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే (బీజేపీ) ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-06-22 04:09 GMT

ఏపీ అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యే ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన వేళ.. అసెంబ్లీ ప్రాంగణమంతా సందడిగా మారింది. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ లాబీల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే (బీజేపీ) ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కడప పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనుందని.. త్వరలో తాను చెబుతున్నది జరిగి తీరుతుందని నమ్మకంగా చెప్పటం ఆసక్తికరంగా మారింది.

ఇంతకూ అదెలా సాధ్యమన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి అరెస్టు అవుతారని.. ఆ తర్వాత ఉప ఎన్నికల జరుగుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని.. ఈసారి ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి భూపేశ్ రెడ్డినే అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇదే భూపేశ్ రెడ్డి అవినాశ్ చేతిలో 62,695 ఓట్ల తేడాతో ఓడిపోవటం తెలిసిందే.

అయితే.. అవినాశ్ రెడ్డి విజయాన్ని చూస్తే.. సంత్రప్తికరమని చెప్పలేం. కారణం.. 2014లో కడప ఎంపీస్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అవినాశ్ రెడ్డి 1,90,323 ఓట్ల మెజార్టీతో గెలిస్తే.. 2019లో అవినాశ్ రెడ్డి ఏకంగా 3,80,726 ఓట్ల అధిక్యతతో విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని అవినాశ్ రెడ్డి సొంతం చేసుకున్నా.. ఆయన మెజార్టీ భారీగా పడిపోవటం తెలిసిందే.

అయితే..ఈసారి ఈ ఎంపీ స్థానం నుంచి వైఎస్ కుమార్తె షర్మిల పోటీ చేయటం.. గట్టి పోటీ ఇవ్వటంతో అవినాశ్ రెడ్డి మెజార్టీ భారీగా తగ్గిపోయింది. గడిచిన ఐదేళ్లుగా వైఎస్ వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి అరెస్టు ఖాయమన్న ప్రచారం జరుగుతున్నా జరగని వేళ.. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నోటి నుంచి అరెస్టు మాటతో పాటు.. ఉప ఎన్నిక మాట రావటం సంచలనంగా మారింది.

ఈ సందర్భంలోనే ఆయన మరో కీలక వ్యాఖ్య చేశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సైతం బీజేపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. హైకమాండ్ వద్దని చెబుతున్నా ఆయన ఊరుకోవటం లేదని పేర్కొన్నారు. అంతేకాదు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా బీజేపీలో చేరాలన్న ఒత్తిడిని మిథున్ రెడ్డి చేస్తున్నట్లుగా చెప్పారు. మొత్తంగా ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Tags:    

Similar News