జగన్ మీద కసిగా మాజీ మంత్రి... జైలుకేనా ?

కడప జిల్లాలో సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి మొదట కాంగ్రెస్ తరువాత వైసీపీలో ఉన్నారు

Update: 2024-08-05 03:38 GMT

కడప జిల్లాలో సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి మొదట కాంగ్రెస్ తరువాత వైసీపీలో ఉన్నారు. ఆయన 2014లో జగన్ పార్టీ ద్వారా జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. మూడేళ్ళు తిరగకుండానే వైసీపీకి హ్యాండ్ ఇచ్చి టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. జగన్ అధికారానికి దూరంగా ఉన్న రోజులలో కడప మంత్రిగా జిల్లాలో పవర్ ని చలాయించారు.

జగన్ తనను తక్కువ చేసి చూశారని తనని సైడ్ చేశారని ఆయన ఎన్నో సార్లు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. జగన్ ని వీడిన తరువాత ఆదినారాయణరెడ్డి మంత్రి అయ్యారు. 2019లో కడప ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయినా కీలక నేతగా ఉన్నారు. 2024లో బీజేపీ తరఫున ఆది జమ్మలమడుగు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. తన బలం చెక్కుచెదరలేదని కూడా నిరూపించుకున్నారు.

ఇదిలా ఉంటే అవకాశం వస్తే చాలు జగన్ మీద ఘాటైన విమర్శలు చేయడంలో ఆదినారాయణరెడ్డి ముందు వరసలో ఉంటారు. తాజాగా ఆయన జగన్ మీద సంచలన ఆరోపణలు చేశారు. ఈసారే కాదు 2029లోనూ ఏపీలో ఎన్డీయే కూటమి గెలుస్తుందని బంపర్ విక్టరీ కొడుతుందని ఆది జోస్యం చెప్పారు. అంతే కాదు కూటమికి 200 సీట్లు వస్తాయని అన్నారు. మరి ఏపీలో ఉన్నవి 175 అసెంబ్లీ సీట్లే.

కానీ ఆది రెండు వందలు అంటున్నారు అంటే అందులో అసెంబ్లీ సీట్లు 175 ప్లస్ ఎంపీ సీట్లు పాతిక కూడా కలిపి చెప్పారుట. అంటే ఏపీలో వైసీపీకి గుండు సున్నా సీట్లే వస్తాయని ఆది జోస్యం చెప్పారు. అంతే కాదు ఉలివెందులలో జగన్ ని ఈసారి ఓడించి తీరుతామని చాలా కసిగానే ఆది ప్రకటించారు.

జగన్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఇక రారని ఆయన నేరుగా వెళ్ళేది జైలుకే అని కూడా ఆయన సంచలన కామెంట్స్ చేశారు. అయిదేళ్ళ ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏకంగా అయిదు లక్షల కోట్లు దోచేశారని తీవ్ర ఆరోపణలే చేశారు. ఒకటీ రెండూ కాదు వైసీపీ నేతలు గత ఐదేళ్లలో అంతులేని అక్రమాలకు పాల్పడ్డారని అలా అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.

జగన్ తన 60 నెలల పాలనలో ఏనాడు కూడా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని అంటూ ఆది ఆయన మీద విరుచుకు పడ్డారు. అదే చంద్రబాబు అధికారంలోకి రాగానే ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చారని కొనియాడారు. ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, సామాజిక పింఛనుదారులకు ఒకటో తేదీనే ఠంచనుగా చెల్లింపులు చేయడం చంద్రబాబు పాలనా దక్షతకు నిదర్శనం అని అభివర్ణించారు.

జగన్ అయితే తన అరవై నెలల పదవీ కాలంలో జగన్ బటన్ నొక్కాను అని గొప్పగా చెప్పుకుంటూ తిరిగారు తప్ప ప్రజలకు తాను చేసిన ఒక్క మంచి పని లేదని ఆది సెటైర్లు వేసారు. ఏపీలో వైసీపీ బ్యాచ్ మొత్తం అయిదు లక్షల కోట్లు దోచేస్తే అందులో జగన్ వాటా రెండు లక్షల కోట్లు అని మిగతాది మాత్రం అందరూ కలిసి మూడు లక్షల కోట్ల వరకు తిన్నారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు.

వైసీపీ నేతల గురించి కూడా ఆది సెటైర్లు పేల్చారు. కొందరు జైల్లో ఉన్నారు, కొందరు బెయిల్ మీద ఉన్నారు, జగన్ మోహన్ రెడ్డి మాత్రం గాల్లో తిరుగుతున్నారు అని వ్యాఖ్యానించారు. ఎవరు ఎక్కడ తిరిగినా తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరని పెద్దిరెడ్డి సహా అందరూ జైలుకు పోయే పరిస్థితి దగ్గరకు వచ్చేసిందని ఆది జోస్యం చెప్పారు.

ఏదైనా ఆర్ధిక లావాదేవీలలో 40 లక్షలకు మించి అవినీతి జరిగితే ఈడీ రంగంలోకి దిగుతుందని ఏపీలో చూసే లక్షల కోట్ల స్కాం జరిగిందని ఆది మండిపడ్డారు. దాంతో ఈడీ కనుక ఎంటర్ అయితే జగన్ తో సహా అందరూ జైలుకు వెళ్లాల్సిందే అని ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు. మొత్తానికి పులివెందులలో జగన్ని ఓడించడం ఆయనని జైలుకు పంపడం ఖాయమని ఆది చాలా కసిగానే ప్రకటించేశారు. ఇక ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News