బీజేపీ కురువృద్ధుడికి భారతరత్న

ఎల్కే అద్వానీ అవిభక్త భారత్‌ లోని కరాచీలో 1927లో జన్మించారు. దేశ విభజన తర్వాత బాంబేకి వచ్చారు

Update: 2024-02-03 07:04 GMT

బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని లాల్‌ కృష్ణ అద్వానీ (ఎల్కే అద్వానీ)కి కేంద్ర ప్రభుత్వం.. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ లో ఆయన పోస్టు చేశారు. అద్వానీకి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

ఎల్కే అద్వానీ అవిభక్త భారత్‌ లోని కరాచీలో 1927లో జన్మించారు. దేశ విభజన తర్వాత బాంబేకి వచ్చారు. అక్కడే కళాశాల విద్యనభ్యసించారు. ఆ తర్వాత ఆయన గుజరాత్‌ లోని గాంధీనగర్‌ నుంచి పలుమార్లు లోక్‌ సభకు ఎన్నికయ్యారు.

బీజేపీని జీరో నుంచి ప్రస్తుతం ఉన్న స్థాయికి చేర్చడంలో మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజపేయితో కలిసి అద్వానీ క్రియాశీలక పాత్ర పోషించారు. 1980వ దశకంలో దేశవ్యాప్తంగా రెండు సీట్లు మాత్రమే ఉన్న బీజేపీని ఆ తర్వాత దేశమంతా విస్తరించడంలో విశేష కృషి చేశారు. 1989 ఎన్నికల నాటికి బీజేపీ 2 సీట్ల నుంచి 86 ఎంపీ సీట్లను గెలుచుకోవడంలో ఆయనదే కీలక పాత్ర. బీజేపీలో అటల్‌ బిహారి వాజపేయి, అద్వానీ, మురళీ మనోహర్‌ జోషిలను త్రిమూర్తులుగా పిలుస్తారు.

ఇప్పటికే అటల్‌ బిహారి వాజపేయి భారతరత్న పురస్కారం లభించింది. ఇప్పుడు ఎల్కే అద్వానీకి కూడా లభించడం విశేషం. కరడు గట్టిన హిందుత్వ వాదిగా ముద్ర పడ్డ ఎల్కే అద్వానీ గతంలో రామజన్మభూమి (అయోధ్య)లో రామాలయం నిర్మించాలంటూ దేశవ్యాప్తంగా రథయాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో బీహార్‌ లో అరెస్టు అయ్యారు.

1970 నుంచి 1989 వరకు నాలుగుసార్లు అద్వానీ రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. అప్పట్లో జనసంఘ్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అద్వానీ 1977 లోక్‌ సభ ఎన్నికల ముందు ఆ పార్టీని జనతా పార్టీలో విలీనం చేశారు. 1977లో కేంద్రంలో జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వంలో అద్వానీ కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా రాజ్యసభలో అధికార పార్టీ తరఫున సభా నాయకుడిగా వ్యవహరించారు.

1980లో అటల్‌ బిహారి వాజపేయితో కలిసి బీజేపీని ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నాలుగుసార్లు పనిచేశారు. 1989లో తొలిసారి లోక్‌ సభకు ఎంపికయ్యారు. మొత్తం మీద ఏడుసార్లు లోక్‌ సభా ఎంపీగా గెలుపొందారు. 2019 ఎన్నికల వరకు సుదీర్ఘ కాలం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రికార్డును దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన వయోభారంతో ఎన్నికల్లో పోటీ చేయలేదు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 1998 నుంచి 2004 వరకు కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలో 2002 నుంచి 2004 వరకు దేశ ఉప ప్రధానిగా పనిచేశారు. అలాగే గతంలో సుదీర్ఘకాలం లోక్‌ సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.

ప్రజా సేవకు గానూ 2015లో అద్వానీకి రెండో అత్యున్నత పౌరపురస్కారం.. పద్మవిభూషణ్‌ లభించింది. ఇప్పుడు ఏకంగా దేశంలోనే అత్యున్నత పురస్కారం భారతరత్నకు ఎంపికయ్యారు. అద్వానీకి ఒక కుమార్తె ప్రతిభ, కుమారుడు జయంత్‌ ఉన్నారు. ఆయన సతీమణి 2016లో కన్నుమూశారు.

Tags:    

Similar News