పాకిస్థాన్ వైపుగా పని మొదలుపెట్టిన పక్కలో బల్లెం.. ఒకప్పటి వరం!
రెండు రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్థాన్ వైమానిక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సుమారు 40 మంది వరకూ మృతి చెందినట్లు చెబుతున్నారు
రెండు రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్థాన్ వైమానిక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సుమారు 40 మంది వరకూ మృతి చెందినట్లు చెబుతున్నారు. దీనిపై స్పందించిన తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ.. త్వరలో ప్రతీకార చర్యలు ఉంటాయని ప్రతిజ్ఞ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా పాక్ దిశగా ఫైటర్స్ ని సాగనంపిందని అంటున్నారు.
అవును... ఒకప్పుడు తాను పెంచి పోషించిన తాలిబన్లే ఇప్పుడు పాకిస్థాన్ కు పక్కలో బల్లెంలా తయారయ్యారని అంటున్నారు. వాస్తవానికి రెండు రోజుల క్రితం పాకిస్థాన్ వైమానిక దళం తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ ని టార్గెట్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ లోని పలు ప్రాంతాలపై దాడులు చేసింది. బార్మల్ జిల్లాలోని పక్తికా ప్రావిన్స్ లో ఈ దాడులు జరిగినట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రతీకార చర్యలు ఉంటాయని ప్రతిజ్ఞ చేసిన వెంటనే ఆ దిశగా పని ప్రారంభించేసిందంట ఆఫ్ఘన్. ఇందులో భాగంగా.. సుమారు 15,000 మంది తాలిబాన్ ఫైటర్లను పాకిస్థాన్ సర్హిహద్దు వైపు పంపించడం మొదలుపెట్టిందని చెబుతున్నారు. దీంతో... త్వరలో పాకిస్థాన్ పై తాలిబాన్ల నుంచి భారీ స్థాయిలో దాడులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
వాస్తవానికి ఆఫ్ఘన్ లో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత పాక్ తాలిబన్లు రెచ్చిపోతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... పాక్ లోకి ఖైబర్ ఫఖ్తుంఖ్వా ఫ్రావిన్సుల్లో పాక్ ఆర్మీ, పోలీసులు లక్ష్యంగా దాడులు చేస్తున్నారని తెలుస్తోంది. అంటే.. ఒకప్పుడు ఎవరినైతే పాక్ పెంచి పోషించిందో ఆ తాలిబన్లే ఇప్పుడు ఆ దేశానికి పక్కలో బల్లెంలా మారారన్నమాట.
కాగా.. గతంలో తాలిబన్లు ఆఫ్ఘన్ ని చేజిక్కించుకోవడంపై పాకిస్థాన్ హర్షం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా... అప్పటి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. వారిని ఓ వరంగా అభివర్ణించి, కొనియాడారు! ఆ వరమే ఇప్పుడు వారికి శాపంగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.