ఏపీలో కాంగ్రెస్‌ భారీ స్కెచ్‌!

తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న గిడుగు రుద్రరాజు మరోసారి వైఎస్‌ షర్మిల చేరికపై హాట్‌ కామెంట్స్‌ చేశారు.

Update: 2024-01-01 10:23 GMT

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారనే వార్తలతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు వేడెక్కాయి. ఆమెకు పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగించవచ్చని టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు.. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న గిడుగు రుద్రరాజు మరోసారి వైఎస్‌ షర్మిల చేరికపై హాట్‌ కామెంట్స్‌ చేశారు.

వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ, అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ధారించారని గిడుగు రుద్రరాజు వెల్లడించారు. షర్మిల కాంగ్రెస్‌ లోకి వస్తుండటం వల్లే ఎంతో మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు తమతో టచ్‌ లోకి వస్తున్నారని బాంబుపేల్చారు.

ఇప్పటికే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తాను షర్మిలతో కలిసి నడుస్తానని స్పష్టం చేశారు. గతంలో వైఎస్‌ జగన్‌ జైలులో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో ఆర్కే పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తాను షర్మిలతో రాజకీయంగా నడుస్తానని ఆర్కే ప్రకటించారు. దీంతో వైసీపీ నేతలు తమతో టచ్‌ లో ఉన్నారని గిడుగు రుద్రరాజు చెప్పినమాటలకు బలం చేకూరింది.

షర్మిల కాంగ్రెస్‌ లో చేరితే పార్టీకి మొదటి నుంచి సంప్రదాయకంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు మళ్లీ కాంగ్రెస్‌ వైపు మళ్లుతారని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వర్గాలన్నీ వైసీపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నాయి.

అయితే షర్మిలను కాంగ్రెస్‌ లో చేర్చుకోవడంతోనే ఆ పార్టీ ఆగిపోవడం లేదు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కాంగ్రెస్‌ పెద్ద ఎత్తున పోరాడనుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గేలతోపాటు ఆ పార్టీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య (కర్ణాటక), రేవంత్‌ రెడ్డి (తెలంగాణ) విశాఖపట్నం వస్తారని గిడుగు రుద్రరాజు చెబుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించడానికి కూడా ప్లాన్‌ చేస్తున్నారు,

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ లో 175 స్థానాల్లోనూ ఇండియా కూటమితో కలసి కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేస్తుందని గిడుగు రుద్రరాజు వెల్లడించారు. వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డిలాగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ లో చేరితే ఆ పార్టీ బలం పెరుగుతుందని అంటున్నారు.

Tags:    

Similar News