నంద్యాలలో ఎన్టీఆర్ శిలాఫలకాన్ని తొలగించింది ఎవరు? అసలేం జరిగింది?

కొన్నేళ్ల క్రితం నంద్యాలలోని విజయ డెయిరీ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Update: 2024-10-16 04:52 GMT

అధికార పార్టీకి చెందిన దివంగత అధినేతల విగ్రహాల్ని.. శిలాఫలకాల్ని తొలగించే ధైర్యం ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలు అస్సలు చేయరు. చేతిలో అధికారం లేని వేళలో.. అధికారపార్టీకి చెందిన ప్రముఖుల విగ్రహాల జోలికి వెళ్లకపోవటం తెలిసిందే. అందుకు భిన్నంగా.. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శిలాపలకాన్ని తొలగించిన వైనం సంచలనంగా మారింది. కొన్నేళ్ల క్రితం నంద్యాలలోని విజయ డెయిరీ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

తాజాగా దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని తొలగించారు వైసీపీ నేత.. విజయ డెయిరీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. అధికార పార్టీకి చెందిన వారంతా ఈ ఘటనపై తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ శిలాఫలకాన్ని తొలగించిన ఘటన గురించి సమాచారం అందినంతనే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రంగంలోకి దిగారు.

ఎన్టీఆర్ శిలాఫలకాన్ని ఎలా తొలగిస్తారు? అంటూ నిప్పులు చెరిగిన ఆమె.. ‘‘ఆధునికీకరణ అంటూ ఇలా వ్యవహరిస్తారా? ఇలా చేస్తే సహించేది లేదు. విజయ డెయిరీ ఛైర్మన్ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. ప్రోటోకాల్ విస్మరిస్తారా? ఎన్టీఆర్ పేరున ఉన్న శిలాఫలకాన్ని తొలగిస్తారా? ఎంత అహంకారం?’’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

నిజానికి ఇదంతా జరగటానికి ముందు ఎన్టీఆర్ శిలాఫలకాన్ని తొలగించిన వైనం గురించి తెలుసుకున్న అఖిల ప్రియ సీరియస్ గా డెయిరీ ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. ఈ డెయిరీ మరెవరిదో కాదు.. అఖిల ప్రియ మేనమామది. తనిఖీల్లో భాగంగా డైయిరీలో వైసీపీ అధినేత కం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉండటాన్ని తప్పు పట్టారు. జగన్ ఫోటోల్ని తొలగించి చంద్రబాబు ఫోటోల్ని ఉంచారు.

మాజీ సీఎం జగన్ ఫోటోలు పెట్టిన సిబ్బందిని తీవ్రంగా మందలించారు. ఎన్టీఆర్ శిలాఫలకాన్ని తొలగించి మురికి కాలవులో పడేసే వారిని వదిలి పెట్టేది లేదన్నారు. ఈ సందర్భంగా డెయిరీ ఛైర్మన్ కుర్చీలో కూర్చున్న అఖిలప్రియ.. తన మామకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తన కుర్చీలో ఎలా కూర్చుంటావ్? అని ప్రశ్నించారు. దీనికి ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన అఖిలప్రియ.. బెదిరిస్తున్నావా? గతంలో మా కుర్చీలో మీరు కూర్చోలేదా? నన్ను కుర్చీలో నుంచి కదపండి చూద్దాం’’ అంటూ అఖిలప్రియ చెలరేగిపోయారు.

తనిఖీ అనంతరం నంద్యాల విజయ డెయిరీ వద్ద ఫక్కన పెట్టిన శిలాఫలకానికి అఖిలప్రియ పాలాభిషేకం చేశారు. ఈ ఉదంతం మరోసారి జరిగితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. డెయిరీ ఛైర్మన్ కు ఫోన్ చేసిన అఖిలప్రియ.. శిలాఫలాకాన్ని ఎందుకు తొలగించారు? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా.. అధికారపార్టీకి చెందిన వ్యవస్థాపకుడి విగ్రహాన్ని ఎలా తొలగిస్తారు? వివాదాన్ని ఎందుకు క్రియేట్ చేసుకున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News