శుభమాని బడ్జెట్ సెషన్ : అపశకునం పలికిన అఖిలేష్ !
ఇండియా కూటమి కట్టి అన్ని పార్టీలు కలసి పోటీ చేస్తేనే ఆ నంబర్ 230 దాటలేదు అని గుర్తు చేస్తున్నారు.
అదేంటో మోడీకి మనశ్శాంతి లేకుండా విపక్షం చేస్తోంది. నిజమే కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు. అయితే ఒంటరిగా 240 సీట్లు తెచ్చుకుని దేశంలో పొలిటికల్ టవర్ గా నిలబడిన పార్టీ తమదేనని అమిత్ షా ఒక వైపు గర్వంగా చెబుతున్నారు. ఇండియా కూటమి కట్టి అన్ని పార్టీలు కలసి పోటీ చేస్తేనే ఆ నంబర్ 230 దాటలేదు అని గుర్తు చేస్తున్నారు.
ఇక ఎన్డీయేలో మిత్రులతో ఎన్నికల ముందే పొత్తులు పెట్టుకుని పోటీ చేసామని అలా ఎన్డీయే కూటమికి 294 ఎంపీల మద్దతుతో పూర్తి మెజారిటీ వచ్చిందని అంటున్నారు. అయితే ఇండియా కూటమి మాత్రం మిత్రులను పక్కన పెట్టి బీజేపీని టార్గెట్ చేస్తోంది. మిత్రులు లేకపోతే మీకు అధికారం ఎక్కడిది అంటోంది.
మరో వైపు ఎన్డీయేలో కీలకంగా ఉన్న మిత్రులను కూడా రెచ్చగొడుతోంది. ఇప్పటికే బీహార్ కి ప్రత్యేక హోదా కోరుతూ జేడీయూ ఎన్డీయేని డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే జేడీయూ ఏమి చేస్తుంది అన్నది ఇప్పుడు తెలియదు కానీ ఏదైనా చేస్తుంది అని ఇండియా కూటమి బలంగా నమ్ముతున్నట్లు ఉంది.
అందుకే తుమ్మితే ఊడే ముక్కు లాంటిది ఎన్డీయే ప్రభుత్వం అంటోంది. ఎక్కువ రోజులు మీ అధికారం సాగదు అని ప్రతీ రోజూ ఎకసెక్కం చేస్తోంది. మొన్న కాంగ్రెస్ అయినా నిన్న తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ అయీనా నేడు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అయినా ఎన్డీయే ప్రభుత్వం నిలిచేది కాదు ఏలేది కాదు అని తీసి పక్కన పెట్టేస్తున్నారు.
తాజాగా ఆయన పశ్చిమ బెంగాల్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలసి నిర్వహించిన ఒక భారీ ర్యాలీలో మాట్లాడుతూ మతం పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటే ఎంతో కాలం అది సాగదని బీజేపీని హెచ్చరించారు. దేశాన్ని విభజించాలనుకుంటూ బీజేపీ రాజకీయం చేస్తోందని వారికి విజయాలు తాత్కాలికమే అని విమర్శించారు.
కేంద్రంలో బీజేపీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం బెదిరింపుల ద్వారా ఏర్పడింది అని అఖిలేష్ అంటున్నారు. అంటే మనస్పూర్తిగా మిత్రులు ఎవరూ మద్దతుని ఇవ్వడం లేదని ఆయన భావనగా ఉంది అన్న మాట. ఢిల్లీలో ప్రభుత్వం నడిచే సర్కార్ కాదు పడిపోయే సర్కార్ అని అఖిలేష్ అన్నారు.
బీజేపీని పశ్చిమ బెంగాల్ తో పాటు యూపీ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు అని ఆయన అన్నారు. దాంతో ఎన్డీఏలో లుకలుకలు ఏర్పడుతాయని తొందరలో కేంద్ర ప్రభుత్వం కుప్ప కూలుతుందని జోస్యం చెప్పారు. ఆయనకు మద్దతుగా మమత కూడా అదే మాట అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉండేది కాదని ఊడేదేనని ఆమె బీజేపీకి చురకలు అంటించారు.
మొత్తం మీద శుభమాని తొలిసారి పూర్తి స్థాయి పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టి ప్రజల మద్దతు మన్నన పొందాలని బీజేపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తూంటే అఖిలేష్ యాదవ్ అపశకునం పలికేశారు. ఇక పార్లమెంట్ సవ్యంగా సాగినట్లేనా అన్న చర్చ అయితే బయల్దేరింది.