వావ్.. వాట్ ఏ ఐడియా: అలెక్సాతో కోతుల్ని భయపెట్టింది

ఇంట్లో ఉన్న వర్సువల్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా గుర్తుకు వచ్చి.. దాన్ని సాయం కోరింది. అలెక్సా.. కుక్కలా అరువు అంటూ ఆదేశించింది

Update: 2024-04-07 04:52 GMT

అనూహ్య రీతిలో సమస్య ఎదురైన వేళ.. అర్థం లేని టెన్షన్ తో ఆగమాగం చూస్తుంటాం. అందుకు భిన్నంగా ఊహించని రీతిలో విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న వేళ.. ఒక చిన్నారి వ్యవహరించిన తీరు ఆసక్తికరంగానే కాదు.. వావ్ అనేలా చేసింది. పెద్దలు సైతం భయపడి వణికే పరిస్థితిని.. సమర్థంగా డీల్ చేయటమే కాదు.. పెను ముప్పు నుంచి బయటపడటమే కాదు.. చిన్నారిని కాపాడిన ఒక బాలిక వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉత్తరప్రదేశ్ కు చెందిన నికిత అనే బాలిక బస్తీ జిల్లా నివాసి. పదిహేను నెలల మేనకోడలితో కలిసి ఇంట్లో ఆడుకునే వేళలో.. ఇంట్లోకి కోతుల గుంపు ప్రవేశించింది. ఆ టైంలో ఇంట్లో పెద్దవాళ్లు ఎవరు లేరు. ఇంట్లో వస్తువుల్ని విసిరేయటం.. అక్కడున్న ఫుడ్ ను చిందరవందర చేయటం మొదలెట్టాయి. సదరు కోతుల గుంపులోని ఒక కోతి చిన్నారి వద్దకు వెళుతున్న వైనాన్ని గుర్తించిన నికిత.. భయంతో బెదిరిపోకుండా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించింది.

ఇంట్లో ఉన్న వర్సువల్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా గుర్తుకు వచ్చి.. దాన్ని సాయం కోరింది. అలెక్సా.. కుక్కలా అరువు అంటూ ఆదేశించింది. వెంటనే.. అలెక్సా కుక్కలా పెద్ద పెద్దగా మొరగటం షురూ చేసింది. నిజంగానే కుక్క అరుస్తుందని భావించిన కోతుల గుంపు భయంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాయి. దీంతో చిన్నారిపై కోతుల దాడి నుంచి తప్పించిన నికిత ఆలోచనకు ఇంట్లోని వారు సైతం ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఈ విషయం తెలిసిన వారంతా నికిత సమయస్ఫూర్తిని అభినందిస్తున్నారు.

Tags:    

Similar News