మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా... తెరపైకి మూడు కారణాలు!
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇదే సమయంలో పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన స్పీకర్ కార్యాలయంలో తన రాజీనామా లేఖను ఇచ్చారు. అనంతరం పార్టీ కార్యాలయానికి లేఖ రాశారు. దీంతో మంగళగిరి వైసీపీలో ఏమి జరుగుతుంది అనే చర్చ మొదలైంది.
అవును... మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. గతకొంతకాలంగా నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులోనే ఉంటున్న ఆయన... పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది. మరోపక్క మంగళగిరిలో గంజి చిరంజీవి దూసుకుపోతున్నారు! త్వరలో ఆయనను వైసీపీ ఇంఛార్జ్ గా నియమిస్తారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ఆర్కే రాజీనామా సమర్పించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే ఆయన అసంతృప్తికి మంత్రి పదవి రాకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. రెండో దఫాలో కూడా మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఆయన నాటి నుంచీ అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ఇదే క్రమంలో…ఈసారి మంగళగిరి వైసీపీ టిక్కెట్ పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన వారికి ఇస్తారనే ప్రచారం బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆర్కే కు మరోచోట టిక్కెట్ ఇవ్వాలని పార్టీ భావిస్తుందని అంటున్నారు.
అయితే అందుకు ఆర్కే ఏమాత్రం సానుకూలంగా లేరని సమాచారం. దీంతో... ఆయన తాజాగా రాజీనామా చేశారు. పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పంపిన లేఖలో… తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. రెండు సార్లు తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినందుకు ఆర్కే ఈ సందర్భంగా జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే ఆర్కే రాజీనామాను ఆమోదిస్తారా.. లేక, వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆయనను పిలిపించి మాట్లడతారా అనేది వేచి చూడాలి!
కాగా... మంగళగిరి నియోజకవర్గం నుంచి 2014, 2019ల్లో వరుసగా గెలిచిన ఆర్కే... 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. అత్యంత కీలకమైన ఆ స్థానంనుంచి నాడు 5,337 ఓట్ల మెజారిటీతో లోకేష్ పై గెలిచారు.