కాంగ్రెస్‌ లో చేరుతున్న తొలి వైసీపీ ఎమ్మెల్యే ఈయనే!

వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ పార్టీ అభ్యర్థుల స్థానాల్లో పలు మార్పులు చేశారు

Update: 2024-01-03 09:29 GMT

వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ పార్టీ అభ్యర్థుల స్థానాల్లో పలు మార్పులు చేశారు. ఇందులో భాగంగానే మంగళగిరి స్థానాన్ని ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నిరాకరించడంతో ఆయన ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నానని వెల్లడించారు. వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరగానే ఆమెతోపాటు తాను కూడా చేరతానని తెలిపారు. ఈ మేరకు ఆమెతో కలిసి తాను కూడా ఢిల్లీకి వెళ్తున్నానని వివరించారు. తాను కాంగ్రెస్‌ పార్టీ నుంచే వచ్చానని.. ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్తున్నానని పేర్కొన్నారు.

ఏపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరబోయే మొదటి ఎమ్మెల్యేను తానేనని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదని హాట్‌ కామెంట్స్‌ చేశారు. తాను బలవంతపు భూసేకరణను మాత్రమే వ్యతిరేకించానని చెప్పారు. షర్మిలతో పాటు తాను కూడా సీఎం జగన్‌ ను కలవనున్నట్టు వెల్లడించారు.

కాంగ్రెస్‌ పార్టీ స్వాతంత్య్రం ముందు నుంచి ఉందని, ఆ పార్టీకి సంస్థాగతంగా బలమైన కార్యవర్గం ఉందని ఎమ్మెల్యే ఆళ్ల గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తర్వాత ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. కచ్చితంగా ప్రతిపక్షం పోషిస్తానని, కాంగ్రెస్‌ విధానాలకు అనుగుణంగా నడుచుకుంటానని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ కలుస్తాయని తాను భావించడం లేదని అన్నారు. ఓటుకు కోట్లు కేసులో న్యాయపోరాటం కొనసాగుతుందని చెప్పారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని చెప్పారు.

అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వ లోపాలను కూడా తాను ఎండగడతానని ఎమ్మెల్యే ఆళ్ల హాట్‌ కామెంట్స్‌ చేశారు. ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలో తనకు తెలుసన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అనేక మంది పనిచేస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. తాను పార్టీలో కొత్తగా చేరుతున్నానని.. సీనియర్లు తన ముందు వరుసలో ఉండాలని తాను కోరుకుంటున్నానన్నారు.

రాజకీయం వేరు కుటుంబ బంధాలు వేరని తెలిపారు. రాజకీయంలో తన వ్యక్తిగత నిర్ణయం తనదని చెప్పారు. అలాగని కుటుంబ బంధాన్ని పోగొట్టు కోను అని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News