కాంగ్రెస్ పార్టీ అడ్రస్ మారింది!
9A, కోట్లా మార్గ్ చిరునామాకు తరలిపోనుంది. వాస్తవానికి ఇక్కడ కార్యాలయం 2009లోనే పూర్తయింది. అయితే తుది మెరుగులు దిద్దడంలో జాప్యం జరిగింది.
స్వాతంత్ర్య సమరంలో పుట్టిన పార్టీ.. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన పార్టీ.. ఏ దశలోనైనా మళ్లీ పైకి లేవగల పార్టీ కాంగ్రెస్. తీవ్రంగా వ్యతిరేకించిన శక్తులు, వ్యక్తులనైనా తనలో అమాంతం కలిపేసుకోగల పార్టీ కాంగ్రెస్. ఒక పార్టీగా కాంగ్రెస్ కు ఎంత పేరుందో.. ఆ పార్టీలోని హై కమాండ్ (అధిష్ఠానం)కూ అంతే పవర్ ఉంటుంది. ఆ హై కమాండ్ కొలువుండేది ఢిల్లీలో. ఇన్నాళ్లూ దాని చిరునామా.. అంటే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) చిరునామా అక్బర్ రోడ్ లోని 24వ నంబర్ బంగ్లా.
15 ఏళ్ల కిందటే పూర్తి ల్యూటెన్స్ ఢిల్లీగా వ్యవహరించే సెంట్రల్ ఢిల్లీ నుంచి ఏఐసీసీ కార్యాలయం చిరునామా నాలుగున్నర దశాబ్దాల తర్వాత మారనుంది. 9A, కోట్లా మార్గ్ చిరునామాకు తరలిపోనుంది. వాస్తవానికి ఇక్కడ కార్యాలయం 2009లోనే పూర్తయింది. అయితే తుది మెరుగులు దిద్దడంలో జాప్యం జరిగింది. అంటే 15 ఏళ్ల తర్వాత మోక్షం లభించింది. మరో ఒకట్రెండు నెలల్లో ప్రారంభించనున్నారు.
'అధికారానికి' దగ్గర ప్రస్తుతం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం (24, అక్బర్ రోడ్) ఢిల్లీలోని పాలనా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉంది. ఇదే ప్రాంతంలో పాలనా భవనాలతో పాటు పాలకులు, ఉన్నతాధికారుల నివాస భవనాలు ఉంటాయి. ఇక్కడి ప్రభుత్వ బంగ్లాను ఏఐసీసీ ప్రధాన కార్యాలయంగా ఇంత కాలం వాడుకున్నారు. 11, అశోకా రోడ్ బంగ్లాను బీజేపీ కొన్ని దశాబ్దాలు వినియోగించుకుంది. అయితే, ల్యూటెన్స్ ఢిల్లీలో రాజకీయ పార్టీల కార్యాలయాలపై సుప్రీం కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నాటి ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో వివిధ పార్టీలకు స్థలాలను కేటాయించింది. బీజేపీ అధునాతన సదుపాయాలతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ లో కార్యాలయం కట్టుకుంది. దీని కంటే చాలా ఏళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీ కూడా డీడీయూ మార్గ్ లో భవన నిర్మాణం చేపట్టింది. 2014 తర్వాత అధికారం కోల్పోవడంతో నత్తనడకన సాగి ఎట్టకేలకు పూర్తయింది.
130 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నకాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యాలయం గతంలో ప్రయాగ్ రాజ్ (గతంలో అలహాబాద్)లో ఉండేది. దీనిని స్వరాజ్ భవన్ గా పిలిచేవారు. స్వాతంత్ర్యం వచ్చాక ఢిల్లీలోని జంతర్ మంతర్ సమీపంలో 7, జంతర్ మంతర్ భవనాన్ని పార్టీ కార్యాలయంగా చేసుకున్నారు. 1969లో పార్టీలో చీలిక వచ్చాక ఇందిరా గాంధీ నేతృత్వంలోని పార్టీ తాత్కాలిక భవనాల్లో కొన్నాళ్లు నడిచింది. ఎమర్జెన్సీ తర్వాత 1978లో 24, అక్బర్ రోడ్ లోకి మారారు. పక్కనే ఉన్న 10, జన్ పథ్ ను అగ్ర నేత సోనియా గాంధీ నివాసంగా కేటాయించారు. సోనియా అందులోనే ఇప్పటికీ ఉంటున్నారు. 2004-14 మధ్య తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సహా యూపీఏ ప్రభుత్వ హయాంలో పక్కపక్కనే ఉన్న 10, జన్‌పథ్–23, అక్బర్ రోడ్ బంగ్లా కీలక వ్యవహారాలకు, నిర్ణయాలకు కేంద్రంగా నిలిచాయి.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ లోని కొత్త కార్యాలయం ఉండగా, అదే చిరునామా కూడా కానుంది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్తల్లో ఒకరు కావడం గమనార్హం. ఈ పేరు మీద ఉన్న చిరునామాను అంగీకరించలేదు. దీంతో వెనుక ద్వారం కోట్లా మార్గ్‌లో ఉండగా.. దానినే ప్రధాన ద్వారంగా మార్చుకుంది. 9A, కోట్లా మార్గ్ అధికారిక చిరునామాగా మారుతుంది.
ఆరు అంతస్థుల్లో నిర్మించిన భవనాన్ని అహ్మద్ పటేల్, మోతీలాల్ ఓరా వంటి పార్టీ అగ్ర నేతలు దగ్గరుండి ఆర్కిటెక్టులతో డిజైన్ చేయించారు. సోనియా శంకుస్థాపన చేశారు. పటేల్, ఓరా ఇప్పుడు జీవించి లేరు.