వైసీపీ మీద తీవ్ర ఆరోపణలు..ఎంత వరకూ నిజం...!?

మరి ఏపీలో వైసీపీ డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేస్తోందని ఈ రెండు పార్టీలు అంటున్నాయి. అయితే వైసీపీ ఆటలు అసలు సాగవని, ప్రజల్లో చైతన్యం వచ్చిందని చంద్రబాబు అంటున్నారు.

Update: 2024-03-31 03:51 GMT

వైసీపీ సిద్ధం అంటూ జనంలోకి చాలా కాలం క్రితమే వచ్చేసింది. సిద్ధం అంటే సర్వం సిద్ధమని అర్ధం. అంటే ఎన్నికలకు అవసరమైన సరంజామతో వైసీపీ సిద్ధంగా ఉందని అంటున్నారు. ఈ విషయం జనాలకు తెలియకపోవచ్చు కానీ వైసీపీ తో పోటీ పడుతున్న సాటి విపక్షాలకు మాత్రం బాగానే అర్ధం అవుతుందని అంటున్నారు.

వైసీపీ ఇప్పటికే ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇరవై కోట్లు, పార్లమెంట్ నియోజకవర్గానికి యాభై కోట్లు వంతున పోటీ చేసే ఆయా అభ్యర్థులకు చాలా జాగ్రత్తగా చేరవేసింది అని విపక్షాలు అంటున్నాయి. సాధారణంగా పోలింగ్ కి కొద్ది రోజుల ముందు ఇలా ఎంతో కొంత ధన ప్రభావం ఉండడం ప్రతీ ఎన్నికలోనూ కనిపిస్తుంది.

కానీ ఏపీలో అన్నీ ముందస్తుగానే జరుగుతూ వస్తున్నాయి. ఆ విషయంలో వైసీపీ ఇంకా ముందుగా ఉందని విపక్షాలు అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీతో పొత్తు టీడీపీ పెట్టుకున్నది కూడా వైసీపీ ఈ తరహా చర్యలు చేయకుండా అడ్డుకోవడానికే అని అంటున్నారు. కానీ వైసీపీ ఎత్తుకు పై ఎత్తు అన్నట్లుగా ఇంకా తెలివిగా తన పని తాను చేసేసింది అని అంటున్నారు.

దీని మీద ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే సమయంలో ఆరోపణలు చేయడం విశేషం. ప్రజాగళం పేరుతో రాయలసీమ జిల్లాలలో పర్యటిస్తున్న చంద్రబాబు వైసీపీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో బాబాయ్ గొడ్డలివేటు చూశారు అలాగే కోడికత్తి డ్రామా చూశారు అని ఆయన చెప్పుకొచ్చారు.

ఈసారి ఎన్నికల్లో ఇప్పుడు కంటైనర్ డ్రామా చూస్తున్నారు అని బాబు వైసీపీ మీద విమర్శించారు. ఒక కంటైనర్ పెట్టి ఇంట్లో నుంచి ఇసుక డబ్బులు, మద్యం డబ్బులు వైసీపీ పెద్దలు తమ అభ్యర్థుల కోసం పంపించారని బాబు ఆరోపించారు.

అంతే కాదు, గ్రామాల్లో అప్పుడే స్టాక్ పెట్టేశారని కూడా అన్నారు. ఇక ఒక్కో నియోజకవర్గానికి రూ.20 కోట్లు, రూ.30 కోట్లు పెట్టి డబ్బులు పంపించారని, అలాగే, మద్యం మత్తెక్కించి ఓట్లు సంపాదించాలనుకుంటున్నారని బాబు విమర్శించారు. అదే టైంలో పవన్ కళ్యాణ్ పిఠపురం సభలో ఇదే తరహా ఆరోపణలు చేశారు. పోర్టులోని కంటైనర్ల ద్వారా డబ్బులను స్టాక్ పెట్టి ఉంచారని పవన్ అన్నారు.

మరి ఏపీలో వైసీపీ డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేస్తోందని ఈ రెండు పార్టీలు అంటున్నాయి. అయితే వైసీపీ ఆటలు అసలు సాగవని, ప్రజల్లో చైతన్యం వచ్చిందని చంద్రబాబు అంటున్నారు. ప్రజలే వైసీపీని ఓడించి పంపిస్తారు అని ఆయన అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ నుంచి అభ్యర్థులకు నిధులు చేరాయని గత కొన్ని రోజులుగా ప్రచారం అయితే సాగుతూ వస్తోంది. ఇపుడు చంద్రబాబు అదే మాట అనడంతో ఈ ఆరోపణలలో నిజమెంత అన్న చర్చ సాగుతోంది.

Tags:    

Similar News